చర్చలతో చైనా దారికి రాదు

11 Oct, 2020 04:19 IST|Sakshi

భారత్‌కు అమెరికా హితవు

సరిహద్దుల్లో మోహరించిన 60 వేల చైనా సైనికులు

వాషింగ్టన్‌: భారత్, చైనా మధ్య గత అయిదారు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతలకు చర్చలతో పరిష్కారం లభించదని అమెరికా అభిప్రాయపడింది. డ్రాగన్‌ దేశంతో చర్చలు జరిపి ఇక లాభం లేదని భారత్‌కు హితవు పలికింది. ఇరుదేశాల మధ్యనున్న వాస్తవాధీన రేఖను చైనా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోందని స్పష్టం చేసింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రియెన్‌ చైనాతో ఒప్పందాలు, చర్చలు అంటూ కాలయాపన చేయొద్దని, చర్చలతో పరిష్కారం దొరకదన్న విషయాన్ని భారత్‌ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా చైనా వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. భారత్‌ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉత్తరంగా చైనా 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి కయ్యానికి కాలు దువ్వుతోందని అన్నారు.

చైనాది దురాక్రమణ బుద్ధి
కమ్యూనిస్టు పార్టీ దురాక్రమణ బుద్ధితో భారత్, తైవాన్‌ దేశాల సరిహద్దుల్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు పన్నుతోం దని రాబర్ట్‌ ఓ బ్రియెన్‌ అన్నారు. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తైవాన్‌ సరిహద్దుల్లో నిరంతరాయంగా సైనిక విన్యాసాలకు దిగుతోందని అన్నారు. చైనా వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌ (ఓబీఓఆర్‌) ప్రాజెక్టు కూడా ఇతర దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయడానికేనని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులైన కంపెనీలకు చైనా బలవంతంగా రుణాలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుందని వాటిని చెల్లించలేక అవన్నీ డ్రాగన్‌ దేశానికి దాసోహం అంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కల్పించే మౌలిక సదుపాయాలు అంతిమంగా చైనాకే ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అన్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని భారత్‌ ఇకనైనా చర్చలతో చైనా దారికి రాదు అన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు.

క్వాడ్‌ దేశాలకు డ్రాగన్‌తో ముప్పు
డ్రాగన్‌ దేశం అత్యంత హీనంగా వ్యవహరిస్తూ క్వాడ్‌ దేశాలకు ముప్పుగా మారిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ సరిహద్దుల్లో 60 వేల మందికి పైగా సైనికుల్ని మోహరించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంద న్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో చైనాకు చెక్‌ పెట్టడానికి ఇండో పసిఫిక్‌ దేశాలు అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా క్వాడ్‌ గ్రూపుగా ఏర్పడ్డాయి. ఇటీవల ఈ దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో సమావేశమై చర్చించారు. భారత్‌ విదేశాంగ మంత్రి జై శంకర్‌తో ఫలప్రదమైన చర్చలు జరిపానని టోక్యో నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వచ్చిన అనంతరం ఒక టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు