జాక్ మాకు షాకిచ్చిన వ్యాక్సిన్ టైకూన్  

24 Sep, 2020 13:10 IST|Sakshi

బీజింగ్ : అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మాకు వ్యాక్సిన్ టైకూన్, వాటర్ బాటిళ్ల వ్యాపారవేత్త భారీ షాక్ ఇచ్చాడు. రీటైల్ పెట్టుబడిదారుడైన జాంగ్ షాన్షాన్ చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.  బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం జాంగ్ షాన్షాన్ నికర విలువ బుధవారం 58.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది జాక్ మా కంటే రెండు బిలియన్ డాలర్లు ఎక్కువ. దీంతో ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తరువాత ఆసియాలో రెండవ ధనవంతుడిగా ఉన్నారు. అలాగే ప్రపంచంలో 17 వ సంపన్నుడుగా జాంగ్  ఘనత దక్కించుకున్నారు.

బుధవారం అమెరికా స్టాక్  మార్కెట్లో ఐటీ నష్టాలతో ప్రపంచంలోని 500 ధనవంతుల సంపద భారీగా తుడుచు పెట్టుకుపోయింది. ప్రధానంగా బ్యాటరీ ఈవెంట్ అంచనాలను అందుకోకపోవడంతో మస్క్ 10 బిలియన్ డాలర్లను కోల్పోయారు.  బెజోస్ 7.1 బిలియన్ డాలర్లు నష్టపోయారు.  ఫలితంగా మస్క్ సంపద  93.2 బిలియన్ డాలర్లకు చేరగా,  బెజోస్ నికర సంపద 178 బిలియన్ డాలర్లుగా ఉంది.  జాంగ్ బుధవారం ఒక్క రోజు 4 బిలియన్ల డాలర్లు సాధించడం విశేషం. "లోన్ వోల్ఫ్"  గా పేరొందిన షాన్షాన్ అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్,  టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తరువాత ప్రపంచంలో మరెవ్వరూ సాధించని ఆదాయాన్ని  ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నారు. 2020లో  అతని సంపద  51.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. 

వాటర్ బాటిల్ కంపెనీ నాంగ్ఫు స్ప్రింగ్  కంపెనీ ఐపీవో ద్వారా హాంకాంగ్ లో అతిపెద్ద రీటైల్ పెట్టుబడిదారుడిగా షాన్షాన్ అవతరించాడు. ఆ తరువాత బీజింగ్ వంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ  కంపెనీ లిస్టింగ్ ద్వారా  ఆగస్టు నాటికి ఆయన నికర విలువ ఏకంగా  20 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే త్వరలోనే జాక్ మా మళ్లీ టాప్ ప్లేస్ కు చేరుకుంటాడని అంచనా. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు