చైనా మాస్టర్ ప్లాన్‌.. ప్రపంచవ్యాప్తంగా అక్రమ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు!

28 Sep, 2022 14:40 IST|Sakshi

బీజింగ్‌: ‍గ్లోబల్‌ సూపర్‌పవర్‌గా ఎదగాలనే తన లక్ష్యాన్ని సాధించేందుకు చైనా శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. అభివృద్ధి చెందిన కెనడా, ఐర్లాండ్‌ వంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్రమంగా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఈ రహస్య  పోలీస్‌ స్టేషన్లపై సంచలన విషయాలు వెల్లడించింది ఓ నివేదిక. ఈ అంశంపై మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కెనడా వ్యాప్తంగా పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరో(పీఎస్‌బీ) అనుబంధంగానే అలాంటి అక్రమ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారని ఇ‍న్వెస్టిగేటివ్‌ జర్నలిజమ్‌ రిపోర్టికా..స్థానిక మీడియాతో వెల్లడించింది. చైనా విరోధులను నిలువరించేందుకు ఈ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. గ్రేటర్‌ టొరొంటే ప్రాంతంలోనే ఇలాంటివి మూడు స్టేషన్లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. ఈ అక్రమ పోలీస్‌ స్టేషన్ల ద్వారా పలు దేశాల్లో ఎన్నికలను సైతం చైనా ప్రభావితం చేస్తోందని సంచనల విషయాలు వెల్లడించింది.

21 దేశాల్లో 30 అక్రమ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చైనాలోని ఫుఝో పోలీసులు తెలిపారని రిపోర్టికా పేర్కొంది. ఉక్రెయిన్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ, యూకే వంటి దేశాల్లోనూ చైనా పోలీస్‌ స్టేషన్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారని తెలిపింది. ఆయా దేశాల్లోని పలువురు నేతలు చైనా ప్రబల్యాన్ని ప్రశ్నిస్తున్నారని, మానవ హక్కులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు రిపోర్టికా పేర్కొంది. మరోవైపు.. స్వదేశంలో భద్రత పేరుతో ప్రజలను అణచివేస్తున్న తీరుపై అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు మానవ హక్కుల ప్రచారకర్తలు.

ఇదీ చదవండి: జనంలోకి జిన్‌పింగ్‌

మరిన్ని వార్తలు