ప్రకృతి విలయం చేజేతులారా పాక్‌ చేసుకున్న పనే! మిత్రదేశం చైనా ప్రకటన తప్ప సాయానికి నో!

29 Aug, 2022 17:41 IST|Sakshi

ఇస్లామాబాద్‌: మునుపెన్నడూ చూడని రీతిలో పాకిస్థాన్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. వాతావరణ విపత్తు ప్రభావంతో జూన్‌ మధ్య నుంచి అక్కడి భారీ వర్షాలు, వరదలు పోటెత్తుతున్నాయి. ఈ ప్రభావంతో  ఏకంగా వెయ్యి మందికి పైగా మరణించడంతో పాటు మూడు కోట్ల మందికిపైగా ప్రజలు వరదల ప్రత్యక్ష ప్రభావంతో నిరాశ్రయులు అయ్యాడు. పాక్‌ వరదలకు సంబంధించిన హృదయ విదారక దృశ్యాలు.. ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

మృతుల్లో 350 మంది చిన్నారులే ఉండడం బాధాకరం. మరో పదిహేను వందల మంది వదరల కారణంగా క్షతగాత్రులయ్యారు. 110 జిల్లాలు వరదల ప్రభావంతో దారుణంగా దెబ్బతిన్నాయి. పది లక్షలకు పైగా నివాసాలు పత్తా లేకుండా పోయాయి. ఏడు లక్షలకు పైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. సైన్య విభాగాలు, ఎన్జీవోల సాయంతో ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తోంది ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం.

కానీ, వరద సాయం అందక.. ఇప్పటికీ నీళ్లలోనే ఉండి ఎదురు చూపులు చూస్తున్నారు లక్షల మంది అక్కడ.  అయితే ఇంత జరుగుతున్నా.. పాక్‌ మిత్ర దేశం చైనా మౌనంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2010 తర్వాత.. తీవ్ర స్థాయిలో పాక్‌కు వరదలు పొటెత్తడం గమనార్హం.

ఒకవైపు ఇస్లాం దేశాలు.. పాక్‌కు త్వరగతిన సాయం అందిస్తున్నాయి. అయితే పొరుగునే ఉన్న మిత్రదేశం చైనా మాత్రం ఇప్పటిదాకా వరదలపై సంఘీభావ ప్రకటనలతోనే సరిపెట్టింది. ఆదివారం చైనా విదేశాంగ చేసిన ప్రకటనలో.. కనీసం వరదలపై మాట వరసకైనా ఆర్థిక సాయం, ఇతర సాయం ప్రస్తావన లేదు. చైనా విదేశాంగతో పాటు ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రకటనలు రాకపోవడంపై ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. పైగా అప్పులు ఇవ్వడంలో చూపించే ఆసక్తి.. సాయం  విషయంలో ఏదంటూ మండిపడుతున్నారు పాక్‌ నెటిజన్స్‌.

ఇదిలా ఉంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించుకున్న పాక్‌ ప్రభుత్వం.. విదేశాల నుంచి సాయం కోసం ఎదురు చూపులు చూస్తోంది. ఈ క్రమంలో భారత్‌ పాక్‌ పిలుపునకు స్పందించింది. తక్షణ సాయం అందించడంతో పాటు.. మార్కెట్‌లో పెరిగిన ధరలను నియంత్రించేందుకు కూరగాయలు, పండ్లను భారత్‌ నుంచి ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. వాఘ్‌ సరిహద్దు గుండా వీటిని పాక్‌కు చేరవేయనుంది. ప్రస్తుతం అఫ్గన్‌ టోర్‌ఖాం నుంచి పండ్లు, కూరగాయలు అందుతున్నా.. రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ తీవ్రతను తగ్గించేందుకు భారత్‌ నుంచి పాక్‌ దిగుమతి చేసుకుంటోంది. 

ఇక లాహోర్‌ మార్కెట్‌లో కిలో టొమాటో ధర రూ.500(పాక్‌ కరెన్సీ) కాగా, ఉల్లిపాయ కేజీ రూ.400 పలికింది. మిగతా నిత్యావసరాలది అదే బాట. బలోచిస్తాన్‌, సింధ్‌, సౌత్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌ల వరదల కారణంగా పంట, నిల్వలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రభావంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని తెలుస్తోంది.  

వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయని పాక్‌ వాతావరణ శాఖ ప్రకటించుకుంది. అంతేకాదు.. అడవులు తగలబడిపోయిన విషయాన్ని సైతం గుర్తు చేసింది. అయితే విమర్శకులు మాత్రం.. ఇదంతా పాక్‌ స్వీయ అపరాధం అని అంటున్నారు. డ్యామ్‌లు, వాటర్‌ రిజర్వాయర్ల మీద దృష్టి సారించి చేజేతులారా దేశాన్ని నాశనం చేసిందని పాక్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: వండడానికి మూడు నెలలు పట్టింది.. తినడానికేమో 8 నెలలు!!

మరిన్ని వార్తలు