40 రోజులు.. 200 కోట్ల ప్రయాణాలు

8 Jan, 2023 05:58 IST|Sakshi

నూతన సంవత్సర వేడుకల కోసం

యాత్రలకు సిద్ధమవుతున్న చైనీయులు

షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్‌ యున్‌’లూనార్‌ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి మొదలైన ‘చున్‌ యున్‌’వేడుకల 40 రోజుల సమయంలో చైనీయులు దేశ, విదేశాల నుంచి సొంతూళ్లకు 200 కోట్ల ప్రయాణాలు సాగించనున్నట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5% ఎక్కువని, 2019 ప్రయాణాల్లో 70.3% అని చైనా రవాణా శాఖ తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస సందర్భంగా పేర్కొంది.

కోవిడ్‌ మహమ్మారి కారణంగా 2020 నుంచి చైనీయులు కొత్త ఏడాది ఉత్సవాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో ఈసారి భారీగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా మొదలయ్యే లూనార్‌ కొత్త ఏడాది ఉత్సవాలు 40 రోజులపాటు కొనసాగుతాయి. జనమంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ఇప్పటికే దేశం కోవిడ్‌తో సతమతమవుతుండగా, కోట్లాదిగా జనం రాకపోకలు సాగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కేసులు పెరిగితే, ఆస్పత్రుల్లో సరిపడా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేవని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కోవిడ్‌ పరీక్షలను నిలిపివేసి చికిత్సలు, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు బాధితులకయ్యే చికిత్స ఖర్చులో 60% తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. జనరిక్‌ కరోనా టీకా పాక్స్‌లోవిడ్‌ను చైనాలో తయారు చేసి, పంపిణీ చేసే విషయమై ఫైజర్‌ కంపెనీతో చర్చలు జరుపుతోంది.

మరిన్ని వార్తలు