అంగారకుడిపై అరుణ పతాకం

16 May, 2021 05:11 IST|Sakshi

మార్స్‌పై విజయవంతంగా దిగిన చైనా రోవర్‌

ఈ ఘనత సాధించిన రెండో దేశంగా డ్రాగన్‌ రికార్డు

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం ప్రయోగించిన జురోంగ్‌ రోవర్‌ అంగారక గ్రహంపై శనివారం విజయవంతంగా దిగింది. అరుణ గ్రహంపై రోవర్‌ను దింపిన రెండో దేశంగా చైనా చరిత్ర సృష్టించింది. 9 నిమిషాల ఉత్కంఠ పరిస్థితుల తర్వాత తమ రోవర్‌ మార్స్‌పై దిగినట్లు చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీఎన్‌ఎస్‌ఏ) ప్రకటించింది. చైనా పురాణాల్లోని అగ్నిదేవుడి పేరు జురోంగ్‌. 320 మిలియన్‌ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. ముందే నిర్దేశించినట్లుగా మార్స్‌పై ఉటోపియా ప్లానిటియా దక్షిణ ప్రాంతంలో జురోంగ్‌ చైనా కాలమానం ప్రకారం ఉదయం 7.18 గంటలకు అడుగు మోపింది. రోవర్‌ మార్స్‌పై దిగాక తన సోలార్‌ ప్యానెళ్లను, యాంటెనాను విప్పుకొని, సిగ్నల్స్‌ పంపించగానే చైనా స్పేస్‌ సైంటిస్టులు హర్షాతిరేకాలు చేశారు.

అంగారకుడిపై విజయవంతంగా ఎర్రజెండా పాతి, స్పేస్‌ ప్రాజెక్టుల్లో తాను ముందంజలో ఉన్నానన్న సంకేతాలను ప్రపంచ దేశాలకు చైనా పంపించింది. ప్రాజెక్టును విజయవంతం చేసిన తమ స్పేస్‌ సైంటిస్టులకు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ అభినందనలు తెలిపారు. ఆరు చక్రాలున్న జురోంగ్‌ రోవర్‌ సౌర విద్యుత్‌తో పనిచేస్తుంది. తనకు అవసరమైన విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకుంటుంది. ఈ రోవర్‌ బరువు 240 కిలోలు. తన వెంట ఆరు శాస్త్ర సాంకేతిక పరికరాలను మార్స్‌పైకి మోసుకెళ్లింది. ల్యాండర్‌ నుంచి వేరుపడిన తర్వాత మూడు నెలల పాటు విధులు నిర్వర్తిస్తుంది. అరుణ గ్రహం ఉపరితలంపై జీవించడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలిస్తుంది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు