చంద్రుడిపై చైనా కీలక ప్రయోగం

24 Nov, 2020 11:44 IST|Sakshi
చైనా చాంగ్‌-5 మిషన్‌(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

బీజింగ్‌: చంద్రుడి ఉపరితలంపై నమూనాలు సేకరించే దిశగా చైనా కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు మంగళవారం మానవరహిత రాకెట్‌ను విజయవంతంగా చందమామ పైకి పంపింది. తద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టిన అగ్రరాజ్యం అమెరికా, రష్యాల సరసన నిలిచింది. చైనా అధికారిక మీడియా సీజీటీఎన్‌ వివరాల ప్రకారం.. హైనన్‌ సదరన్‌ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సైట్‌ ద్వారా ఉదయం నాలుగున్నర గంటల(స్థానిక కాలమానం ప్రకారం) చాంగ్‌-5 మిషన్‌ను డ్రాగన్‌ దేశం విజయవంతంగా ప్రయోగించింది. చంద్రుడి ఉపరితలంపై గల నమూనాలు భూమి మీదకు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

చాంగ్‌-5 మిషన్‌
చైనీస్‌ చంద్ర దేవత పేరు మీదుగా ఈ మిషన్‌కు చాంగ్‌-5 అని నామకరణం చేశారు. దీనిలో ఒక ఆర్బిటార్‌, లాండర్‌, అసెండర్‌, రిటర్నర్‌ ఉంటాయి. వీటన్నింటి బరువు కలిపి మొత్తంగా దాదాపు 8.2 టన్నులు ఉంటుంది. చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత లాండర్‌-అసెండర్‌, ఆర్బిటార్‌- రిటర్నర్‌ విడిపోతాయి. ఇక చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్‌- రిటర్నర్‌ పరిశోధనలు సాగిస్తే, లాండర్‌- అసెండర్‌ చంద్రుడికి సమీపంలో గల ఓషన్‌ ఆఫ్‌ స్టార్మ్స్‌ వాయువ్య ప్రాంతంలో దిగి నమూనాలు సేకరిస్తుంది. శిలలు, మట్టి సేకరించిన తర్వాత తిరిగి ఇవి వాహననౌకలోకి చేరుకుంటాయి. చంద్రగ్రహంపై అడుగుపెట్టిన 48 గంటల్లో రోబోటిక్‌ ఆర్మ్‌ తవ్వకాలు మొదలుపెడుతుంది. సుమారు 2 కిలోల మేర నమూనాలు సేకరించడమే లక్ష్యంగా ఈ ప్రయోగం జరుగనుందని సీజీటీఎన్‌ వెల్లడించింది.(చదవండి: చైనా కంపెనీపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు)

భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు
ఈ మిషన్‌ ద్వారా భవిష్యత్తులో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు వీలు కలుగుతుందని చైనా జాతీయ అంతరిక్ష సంస్థ(సీఎన్‌ఎస్‌ఏ) లూనార్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రాం సెంటర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పీ జెయూ అన్నారు. మానవరహిత రాకెట్‌ను పంపడం ద్వారా సాంకేతికంగా మరో ముందడుగు వేశామని, చాంగ్‌-5 మిషన్‌ విజయవంతమైతే చంద్రుడి ఉపరితలంపై, వాతావరణ పరిస్థితులపై మరింత లోతుగా అధ్యయనం చేయగలమని పేర్కొన్నారు.   

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా