డ్రాగన్‌ పన్నాగం: సరిహద్దులో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభం

25 Jun, 2021 14:02 IST|Sakshi
అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో చైనా ప్రారంభించిన బుల్లెట్‌ ట్రైన్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

టిబెట్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభించిన చైనా

బీజింగ్‌: సరిహద్దు వివాదాలు పూర్తిగా సమసిపోకముందే డ్రాగన్‌ దేశం చైనా మరో పన్నాగానికి తెర తీసింది. ఈసారి భారత్‌-టిబెట్‌ సరిహద్దుల్లో పట్టు పెంచుకునేందుకు తొలి బుల్లెట్‌ రైలును ప్రారంభించింది. తద్వారా బలగాలను ఈ ప్రాంతంలోకి వేగంగా చేరవేసేందుకు అవకాశం కలుగుతుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చీ వరకూ 435.5 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని, బుల్లెట్‌ ట్రైన్‌ను చైనా ప్రారంభించింది. టిబెట్‌లో ఇదే తొలి బుల్లెట్‌ ట్రైన్. అరుణాచల్‌ ప్రదేశ్‌కు సమీపంలో ఉన్న నింగ్చీకి బుల్లెట్‌ ట్రైన్ ప్రారంభించడం ద్వారా చైనా వ్యూహాత్మక అడుగు వేసినట్లయింది. సిచువాన్-టిబెట్‌ రైల్వే పరిధిలోకి వచ్చే నింగ్చీ సెక్షన్‌లో ఈ బుల్లెట్ రైలు పరుగులు తీయబోతోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా డ్రాగన్ దేశం ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభించింది.

సిచువాన్‌-టిబెట్‌ రైల్వే టిబెట్‌లో నిర్మించిన రెండో రైలు మార్గం. గతంలో క్వింఘాయ్‌-టిబెట్ రైల్వే మార్గాన్ని ప్రారంభించారు. సరిహద్దులో భద్రతను పరిరక్షించడంతో ఈ కొత్త రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుందని.. కనుక దీన్ని తర్వగా పూర్తి చేయాలని నవంబర్‌లో అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ రైలు మార్గం నిర్మాణంతో చెంగ్డూ నుంచి లాసా వెళ్లేందుకు గతంలో 48 గంటల సమయం పడుతుండగా.. తాజాగా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రారంభంతో ఇది 13 గంటలకు తగ్గబోతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ఏర్పాటు కీలక అడుగు కానుంది.

చదవండి: శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..

మరిన్ని వార్తలు