దుర్భేద్యమైన ఉక్కు సైన్యం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

14 Mar, 2023 05:03 IST|Sakshi

బీజింగ్‌: దేశ సార్వభౌమత్వమే పరమావధిగా అత్యంత పటిష్టతర ఉక్కు సైన్యంగా దేశ సాయుధబలగాలను శక్తివంతం చేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఉప్పు– నిప్పుగా ఉండే సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో సఫలీకృతమై అంతర్జాతీయ సమాజంలో ప్రతిష్టను పెంచుకున్న చైనా.. దేశ సైన్యానికి ‘ఆధునిక’ జవసత్వాలను అందించడంపై దృష్టిపెట్టింది. చైనాకు మూడోసారి అధ్యక్షుడయ్యాక జిన్‌పింగ్‌ తొలిసారిగా ప్రసంగించారు.

చైనా పార్లమెంట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రజల నుద్దేవించి మాట్లాడారు. ‘ అంతర్జాతీయ వ్యవహా రాల్లో మరింత క్రియాశీలక పాత్ర పోషించడంతోపాటు అమెరికాసహా పొరుగు దేశాల నుంచి ముప్పు, దేశ సార్వభౌమత్వ సంరక్షణ కోసం సైన్యాన్ని ‘గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ స్టీల్‌ (ఉక్కు సైన్యం)’గా మారుస్తాం. చైనా ముందుకుతెచ్చిన గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌(జీడీఐ), గ్లోబల్‌ సెక్యూరిటీ ఇనిషియేటివ్‌ వంటి కార్యక్రమాల అమలు సహా ప్రపంచ పురోభివృద్ధి, సంస్కరణ పథంలో చైనా ఇకమీదటా గతిశీల పాత్ర పోషించనుంది.

దాంతోపాటే దేశ భద్రత, అభివృద్ది ప్రయోజనాలను కాపాడుకునేందుకు దేశ భద్రత, సాయుధ బలగాలను అజేయశక్తిగా నవీకరించాలి. సుస్థిరాభివృద్ధికి భద్రతే వెన్నుముక’ అని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. ‘మీరు నాపై ఉంచిన నమ్మకమే నన్ను ముందుకునడిపే చోదకశక్తి. నా భుజస్కంధాలపై పెద్ద బాధ్యతల్ని మోపారు’ అన్నారు. ‘‘పొరుగు ప్రాంతాలతో శాంతియుత అభివృద్ధినే కోరుకుంటున్నాం. తైవాన్‌ స్వతంత్రత కోరే వేర్పాటువాదులను, బయటి శక్తుల జోక్యాన్ని అడ్డుకుంటున్నాం. చైనా ఆధునీకరణ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్దాం’ అని పార్లమెంట్‌లో సభ్యులనుద్దేశించి అన్నారు.

మరిన్ని వార్తలు