అమెరికా బలగాలపై దాడికి చైనా సాయం?

2 Jan, 2021 10:23 IST|Sakshi
ట్రంప్‌, రాబర్ట్‌ ఓ బ్రియాన్‌ (ఫైల్‌)

వాషింగ్టన్‌: అఫ్గానిస్తాన్‌లోని తమ బలగాలపై దాడులకు పాల్పడే వారికి రష్యా నజరానా ఇస్తోందంటూ వచ్చిన వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వదంతులంటూ ఇటీవల కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఈసారి చైనా వంతు వచ్చింది. అమెరికా సైనికులపై దాడులకు పాల్పడే అఫ్గాన్‌ ఉగ్రమూకలకు చైనా నజరానా అందజేస్తోందని అమెరికా నిఘావర్గాలు అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారాన్ని గత నెలలో చేరవేశాయి. అయితే, ఈ దాడులకు ఎవరు పాల్పడ్డారు? ఎవరికి నజరానా అందింది? అమెరికా బలగాలపై దాడులు, దాడియత్నాలు జరిగాయా? అనే విషయాలు మాత్రం వెల్లడికాలేదు. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓ బ్రియాన్‌ తాజాగా వెల్లడించారు. (చదవండి: భారతీయ టెకీలకు ట్రంప్‌ మరోసారి షాక్‌!)

6.3 కోట్ల డాలర్ల ఉగ్రనిధులను అడ్డుకున్న అమెరికా
ఉగ్రవాద సంస్థలకు చెందిన 6.3 కోట్ల డాలర్ల నిధులను 2019లో అడ్డుకున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం గురువారం ప్రకటించింది. ఇందులో లష్కరే తోయిబాకు చెందిన 3,42,000 డాలర్లు, జైషే మొహమ్మద్‌కు చెందిన 1,725 డాలర్లు, హర్కుత్‌ ఉల్‌ ముజాహిదీన్‌ అల్‌ ఇస్లామీకి చెందిన 45,798 వేల డాలర్లను బ్లాక్‌ చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ మూడూ పాకిస్తాన్‌ కేంద్రంగా పని చేసేవికాగా, భారత్‌లోని కశ్మీర్‌ కేంద్రంగా పని చేస్తున్న హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు చెందిన 4,321 డాలర్లను కూడా బ్లాక్‌ చేసినట్లు అమెరికా పేర్కొంది. 2019లో ఇది 2,287 డాలర్లుగా ఉంది. 2018లో 4.6 కోట్ల డాలర్ల సొమ్మును బ్లాక్‌ చేసినట్లు వెల్లడించింది.  

అణ్వాయుధ వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్, పాక్‌
ఇస్లామాబాద్‌: ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్‌ పాకిస్తాన్‌లు వార్షిక అణ్వాయుధ నిల్వలు, అణ్వాయుధ నిర్మాణాల వివరాలను పరస్పరం వెల్లడించుకున్నాయి. ఇరు దేశాలు 30 ఏళ్ల క్రితం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ప్రతి యేటా జనవరి 1వ తేదీన అణ్వాయుధ సంపత్తికి సంబంధించిన పూర్తి వివరాలను విడుదల చేస్తారు. కాగా పాకిస్తాన్‌ జైళ్లలో ఖైదీలుగా ఉన్న 49 మంది సాధారణ పౌరులతో సహా 270 మంది జాలర్ల వివరాలను పాక్‌ వెల్లడించింది. అందుకు బదులుగా భారత్‌ సైతం భారతీయ జైళ్ళలో ఉన్న 340 మంది పాకిస్తాన్‌ ఖైదీల వివరాలను వెల్లడించింది. (చదవండి: కరోనా వైరస్.. చైనా గుడ్‌న్యూస్‌)

మరిన్ని వార్తలు