-

యథాతథ స్ధితి నెలకొంటేనే ద్వైపాక్షిక బంధం

7 Aug, 2020 18:33 IST|Sakshi

చైనాకు తేల్చిచెప్పిన భారత్‌

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడే ఉంటాయని డ్రాగన్‌కు భారత్‌ తేల్చిచెప్పింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్‌ షరతు విధించింది. పలుమార్లు డ్రాగన్‌కు ఇదే విషయం స్పష్టం చేసినా సంప్రదింపుల పేరుతో చైనా సరికొత్త ప్రయత్నాలతో ముందుకొస్తూనే ఉంది.

సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా గ్రహించేలా తాము చర్యలు చేపడుతున్నామని ప్రతిష్టంభనపై ప్రభుత్వంతో చర్చిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారని ఓ జాతీయ వెబ్‌సైట్‌ పేర్కొంది. చైనా దూకుడుకు బ్రేక్‌ వేసేందుకు భారత్‌ ఇప్పటికే 100కు పైగా చైనా యాప్‌లను నిషేధించగా, ప్రభుత్వ కాంట్రాక్టులు బీజింగ్‌కు దక్కకుండా నిబంధనలను మార్చింది. ఇక భారత యూనివర్సిటీలతో భాగస్వామ్యంతో ముందుకొచ్చిన చైనా వర్సిటీలు నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశంపై తాజాగా ప్రభుత్వం దృష్టిసారించింది.

చైనాపై భారత్‌ పలు రకాలుగా ఒత్తిడి పెంచుతున్నా డ్రాగన్‌ దారికి రాకపోగా సరికొత్త ఎత్తుగడలతో ముందుకొస్తోంది. ఇండో-చైనా ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్‌లో సేనల ఉపసంహరణ పూర్తయిందని ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. అయితే డ్రాగన్‌ తీరు మార్చుకుని సరిహద్దుల్లో చేపట్టిన సానుకూల చర్యలపై మాట్లాడాలని భారత్‌ కోరుతోంది. చైనా ఇప్పటికీ పెట్రోలింగ్‌ పాయింట్‌ 17, 17 ఏ (గోగ్రా)ల వద్ద, ప్యాంగాంగ్‌ సరస్సు వద్ద తన సేనలను మోహరించిందని భారత సైన్యం ప్రభుత్వానికి క్షేత్రస్ధాయి పరిస్ధితులను నివేదించింది. చదవండి : చైనాకు మరో దెబ్బ : 2500 ఛానళ్లు తొలగింపు 

మరిన్ని వార్తలు