మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం

25 Oct, 2021 06:17 IST|Sakshi

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో మరో డ్రామా  

బీజింగ్‌: భారత్‌తో సరిహద్దు వివాదాలు రాజుకుంటున్న నేపథ్యంలో డ్రాగన్‌ దేశం మరో కొత్త డ్రామాకి తెరతీసింది. సరిహద్దు ప్రాంతాల్ని మరింతగా ఆక్రమించుకోవడానికి వీలుగా సరిహద్దు భూ చట్టానికి ఆమోదముద్ర వేసింది. చైనా ప్రజల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అత్యంత పవిత్రమైనవని, ఎవరూ దానిని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆ చట్టంలో పేర్కొంది.

జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ చట్టాన్ని నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌కి చెందిన స్టాండింగ్‌ కమిటీ శనివారం ఆమోదించినట్టుగా జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.  సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తే చైనా ఎంతటి చర్యలకైనా దిగుతుందని చట్టంలో ఉంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపు, సరిహద్దు ప్రాంతాల రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొంది. మొత్తం 14 దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటున్న చైనాకి ప్రస్తుతం భారత్, భూటాన్‌ లతోనే సమస్యలున్నాయి. మిగిలిన 12 దేశాలతో సరిహద్దు సమస్యల్ని ఆ దేశం పరిష్కరించుకుంది.
(చదవండి: చైనాపై భారత్‌ ఏఐ నిఘా.. చీమ చిటుక్కుమన్నా..)

మరిన్ని వార్తలు