కరోనా కాదు.. అంతకు మించిన భయం చైనా ప్రజల్లో! కారణమిదే..

16 Apr, 2022 18:28 IST|Sakshi

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ విలయతాండవం చేస్తోంది. ఈ రెండేళ్లలో ఏనాడూ లేనంతగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది డ్రాగన్‌ కంట్రీ. ఒకవైపు కేసులు వెల్లువెత్తుతుంటే.. మరోవైపు ప్రజలకు వైద్యం, నిత్యావసరాలు అందడంలో జాప్యం జరుగుతోంది. ఇందుకు కఠోరమైన లాక్‌డౌన్‌ కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓపిక నశిస్తున్న ప్రజలు.. అధికారులపై ఎదురుదాడులకు తెగపడుతున్నారు, నిరసనలకు దిగుతున్నారు. అయినా జింగ్‌పిన్‌ ప్రభుత్వం మాత్రం తగ్గట్లేదు. 

జీరో టోలరెన్స్‌ పేరిట జనాలను మానసికంగా హింసిస్తోంది చైనా ప్రభుత్వం ఇప్పుడు. వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రావడం, కరోనాను ఎదుర్కొగలిగే పరిస్థితులు ఉన్నా కూడా ‘స్టే హోం.. స్టే సేఫ్‌’ పాలసీకే మొగ్గు చూపిస్తోంది. దీనిపై వైద్య నిపుణులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.   ఈ తరుణంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటోంది జిన్‌పింగ్‌ ప్రభుత్వం. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యలన్నీ తాత్కాలికమని, కేసుల కట్టడికి ఈ స్ట్రాటజీ ఉపయోగపడుతుందని మొండిగా వాదిస్తోంది.

ప్రస్తుతం చైనా వ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైతో పాటు పలు ప్రధాన నగరాల్లోనూ కఠినమైన లాక్‌డౌన్‌ అమలు అవుతోంది. వైద్య సిబ్బంది, డెలివరీ బాయ్స్‌, ఎమర్జెన్సీ స్టాఫ్‌ తప్ప.. ఎవరూ బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, మందులు దొరక్క జనాలు ఆర్తనాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ.. సడలింపులకు ప్రభుత్వం నో అంటోంది. 

షాంఘై చుట్టుపక్కల నగర వాసుల్లో ఇప్పుడు లాక్‌డౌన్‌ ఫియర్‌ మొదలైంది. రెండువారాల పాటు అధికారులు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. తమ దగ్గరా షాంఘై తరహా పరిస్థితులు పునరావృతం అవుతుందని వణికిపోతున్నారు. ఇప్పటికే కొందరు ఎమర్జెన్సీ పాసులతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అధికారులు మాత్రం అనుమతులు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు. షాంగ్జి ప్రావిన్స్‌ రాజధాని జియాన్‌ నగరం ఇదివరకే లాక్‌డౌన్‌ అక్కడి ప్రజలకు చీకట్లు మిగల్చగా.. తాజాగా మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వణికిపోతున్నారు. 

ఇక అధికారులు మాత్రం ఇది తాత్కాలిక చర్యలు మాత్రమేనని, వైరస్‌ కట్టడికి ప్రజలు కొంతకాలం ఓపిక పట్టాలని చెప్తున్నారు. అయినా ప్రజల్లో మాత్రం మనోధైర్యం నిండడం లేదు. షాంఘై పరిస్థితులను కళ్లారా చూడడంతో కరోనా కంటే లాక్‌డౌన్‌ పేరు వింటేనే వణికిపోతున్నారు. 

షాంఘైలో ఉన్నత కుటుంబాలు తప్ప మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. బారికేడ్లను బద్ధలు కొట్టి మరీ ఆహారం కోసం పరుగులు తీస్తున్నారు అక్కడి జనాలు. వైద్యం అందక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అంతేకాదు.. నిరసనలను నియంత్రించలేక పోలీసులు దాడులు చేస్తున్న ఘటనలు, మూగజీవాల అవసరాల కోసం బయటకు తీసుకొస్తే.. వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.

చదవండి: కరోనా కారణంగా చైనాలో విపత్కర పరిస్థితులు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు