జన చైనాలో తగ్గిన జనాభా.. 1961 తర్వాత ఇదే తొలిసారి

18 Jan, 2023 06:22 IST|Sakshi

బీజింగ్‌: జన చైనాలో జనాభా కాస్త తగ్గింది. అక్కడ జనాభా సంఖ్య తగ్గుముఖం పట్టడం 1961 ఏడాది తర్వాత ఇదే తొలిసారి! 2021 ఏడాది జనాభా లెక్కలతో పోలిస్తే 2022ఏడాదిలో జనాభా 8,50,000 తగ్గిందని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ తాజాగా వెల్లడించింది. 2022 ఏడాదిలో చైనా జనాభా 141.18 కోట్లు అని నేషనల్‌ బ్యూరో లెక్క తేల్చింది. జననాల వృద్ధిరేటు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఇది ఇలాగే కొనసాగితే అంచనావేసిన దానికంటే ముందుగానే చైనాను దాటేసి భారత్‌ ప్రపంచంలోనే అత్యంత అధిక జనాభాగల దేశంగా అవతరించనుంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు దాదాపు 3 శాతంగా నమోదైన ఈ తరుణంలో జనసంఖ్య సైతం వెనకడుగు వేస్తోంది. గత ఐదు దశాబ్దాల్లో చైనాలో ఇంతటి అత్యల్ప వృద్ధిరేటు నమోదవడం ఇది రెండోసారి. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, జనాభా విభాగం 2022 అంచనాల ప్రకారం ఈ ఏడాదిలోనే చైనాను భారత్‌ జనసంఖ్యలో అధిగమించనుంది. 2050కల్లా భారత్‌ 166.8 కోట్ల మందితో కిటకిటలాడనుంది. 131.7 కోట్లతో చైనా రెండోస్థానానికి పడిపోనుంది.

► 2022లో చైనాలో 95.6 లక్షల మంది జన్మించారు. 2021లో 1.062 కోట్ల మంది జన్మించారు. 2021లో 7.52 శాతమున్న జననాల రేటు 2022లో 6.77 శాతానికి పడిపోయింది.
► చైనాలో 72.20 కోట్ల మంది పురుషులు, 68.96 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. మున్న 16– 59 ఏళ్ల వయసు వారు 87.56 కోట్ల మంది ఉన్నారు.  
► దేశ జనాభాలో సీనియర్‌ సిటిజన్లు 62 శాతం.
► 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 28 కోట్లు దాటింది. జనాభాలో వీరు 19.8 శాతం.
► ఒకప్పుడు వ్యవసాయ ఆధారిత దేశమైన చైనా ఇప్పుడు ప్రపంచ ఉత్పత్తుల కేంద్రంగా ఎదిగింది. దీంతో పరిశ్రమల్లో పనిచేసేందుకు జనం పట్టణాల బాటపట్టారు. దీంతో పట్టణాల్లో నివసిస్తున్న వారి సంఖ్య 92.07 కోట్లకు ఎగబాకింది.

మరిన్ని వార్తలు