Taliban China Friendship: చైనా కీలక హామీ, మరింత మద్దతు

3 Sep, 2021 09:21 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్‌కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది  అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్‌ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని  అబ్దుల్ సలాం వెల్లడించారు.

కాగా అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్‌లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు