చైనా యాప్‌ల నిషేధంపై డ్రాగన్‌​ సీరియస్‌

29 Jul, 2020 08:43 IST|Sakshi

తప్పు సరిదిద్దుకోవాలని బుకాయింపు

సాక్షి, న్యూఢిల్లీ : చైనా యాప్‌ల నిషేధంపై  భారత్‌ తీరును డ్రాగన్‌ తప్పుపట్టింది. తాజాగా నిషేధించిన వి చాట్‌ సహా  చైనా యాప్‌లను భారత్‌ పునరుద్ధరించి తప్పును సరిదిద్దుకోవాలని బుకాయించింది. చైనీస్‌ యాప్‌లపై నిషేధం ఉద్దేశపూరిత జోక్యంగా అభివర్ణించిన పొరుగుదేశం చైనా వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపడతామని పేర్కొంది. దేశ ప్రయోజనాలకు విఘాతం కల్పిస్తున్న చైనా కంపెనీలకు చెందిన నిర్ధిష్ట యాప్‌లను నిషేధిస్తూ భారత్‌​ నిర్ణయించిన నేపథ్యంలో డ్రాగన్‌ ఈ మేరకు స్పందించింది. 59 చైనీస్‌ యాప్‌లకు అనుబంధంగా పనిచేస్తున్న 47 యాప్‌లను భారత్‌ తాజాగా నిషేధించింది. వీటిలో టిక్‌టాక్‌ లైట్‌, హలో లైట్‌, షేరిట్‌ లైట్‌, బిగో లైట్‌, వీఎఫ్‌వై లైట్‌ వంటి యాప్‌లున్నాయి. 250 చైనా యాప్‌లపై నిఘా పెట్టిన భారత్‌ వీటిలో దేశానికి ముప్పుగా పరిణమించే యాప్‌లను పసిగట్టి వాటిని తొలగిస్తోంది. చదవండి : ప‌బ్జీ, లూడో కూడా ఇక లేనట్లే..

వీచాట్‌ నిషేధం అంశంపై భారత్‌తో సంప్రదిస్తున్నామని చైనా రాయబార కార్యాలయ ప్రతనిధి కౌన్సెలర్‌ జీ రోంగ్‌ పేర్కొన్నారు. జూన్‌ 29న భారత్‌ చైనా నేపథ్యంతో కూడిన 59 మొబైల్‌ యాప్స్‌ను నిషేధించడం చైనా కంపెనీల ప్రయోజనాలు, వ్యాపారుల న్యాయపరమైన హక్కులకు తీవ్ర భంగకరమని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌ తాను చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని కోరామని చెప్పారు. మార్కెట్‌ సూత్రాలకు అనుగుణంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను భారత్‌ కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. చైనా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధించడం భారత్‌కు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చవని వ్యాఖ్యానించారు.

కాగా, భారత్‌ తాజాగా నిషేధించిన 47 చైనా యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్‌ సాంకేతిక సమాచార మంత్రిత్వ శాఖ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు అలీబాబాకు చెందిన యాప్‌లతో సహా 250కి పైగా చైనా యాప్‌ల జాబితాను భారత్‌ రూపొందించింది. ఈ యాప్‌లు యూజర్‌ ప్రైవసీ, జాతీయ భద్రత వంటి కీలకాంశాల్లో ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయా అని ఆరా తీస్తోంది. ఈ జాబితాలో గేమింగ్‌ యాప్‌ పబ్‌జీ కూడా ఉంది.  భారత్‌ రూపొందిస్తున్న నిషేధిత జాబితాలో చైనాకు చెందిన ప్రముఖ గేమింగ్‌ యాప్‌లున్నట్టు చెబుతున్నారు. ఈ యాప్‌లు చైనా ఏజెన్సీలతో డేటాను పంచుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. 

మరిన్ని వార్తలు