భగ్గుమంటున్న చైనా!...తైవాన్‌ పై కక్ష సాధింపు చర్యలు

3 Aug, 2022 15:54 IST|Sakshi

బీజింగ్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టంచింది. ఎట్టకేలకు ఆమె మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్‌ దిగుమతులపై నిషేధం విధించింది.

ఈ మేరకు తైవాన్‌ నుంచి దిగుమతి అయ్యే పళ్లను, చేపల ఉత్పత్తులతోపాటు సహజ సిద్ధంగా లభించే ఇసుకను  చైనా నిషేధించింది. ఆయా ఉత్పత్తుల్లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయని,  పైగా ఆ ప్యాకేజిలపై చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చిందంటూ సాకులు చెబుతూ తైవాన్‌ దిగుమతులను నిషేధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్‌ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది. ఇలా తైవాన్‌ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు.

ఇలా మార్చి 2021లో తైవాన్‌ ఎగుమతి చేసే పైనాపిల్‌లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. పైగా రాజకీయపరంగానే ఇలా కక్ష పూరిత చర్యకు చైనా పాల్పడిందని సమాచారం. అదీగాక 2016 నుంచి తైవాన్‌ అధ్యక్షురాలిగా సాయ్‌ ఇంగ్‌ వెన్‌ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్‌ పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్‌ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది.

ఇదిలా ఉండగా తైవాన్‌ని చుట్టుముట్టి ప్రత్యక్ష మిలటరీ డ్రిల్‌ను నిర్వహిస్తున్నట్లు చైనా అధికారులు ప్రకటించారు. తైవాన్‌లోని కీలక ఓడరేవుల్లోనూ, పట్టణా ప్రాంతాల్లోనూ దాడులు చేస్తామని చైనా బెదిరింపులు దిగుతుందని  తైపీ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. తైవాన్‌ సరిహద్దు ప్రాంతానికి సుమారు 20 కిలో మీటరల​ దూరంలో మిలటరీ ఆపరేషన్లు చేపట్టినట్లు చైనీస్‌ పిపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ తెలిపింది. అయినా దాదాపు 23 మిలయన్ల జనాభా ఉన్న తైవాన్‌ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు.  ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హయాంలో ఆ ముప్పు  మరింత తీవ్రతరమైంది.

(చదవండి: హైటెన్షన్‌.. తైవాన్‌లో నాన్సీ పెలోసీ.. రెచ్చగొట్టేలా ట్వీట్లు.. పరిణామాలపై చైనా హెచ్చరిక)

మరిన్ని వార్తలు