భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం

18 Aug, 2020 03:19 IST|Sakshi

చైనా విదేశాంగ శాఖా మంత్రి

ఇరుదేశాల అభివృద్ధికి పాటుపడదామని పిలుపు

ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ఉపన్యాసంపై స్పందించిన చైనా

బీజింగ్‌: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాల ను సామరస్యంగా పరిష్కరించుకోవ డానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్‌తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్‌ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పై విధంగా వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్‌ఓసీ నుంచి ఎల్‌ఏసీ వరకు మా దేశంపై సవాల్‌ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.

తూర్పు లద్ధాఖ్‌  సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్‌ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్‌ ప్రపంచానికే మేలు చేస్తుందని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు. 

మరిన్ని వార్తలు