ఆ ట్రిబ్యునల్‌ తీర్పు చెత్త కాగితంతో సమానం!: చైనా

13 Jul, 2021 01:16 IST|Sakshi

బీజింగ్‌: దక్షిణ చైనా సముద్రంపై 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పు చెత్తకాగితంతో సమానమని చైనా వ్యాఖ్యానించింది. ఆ తీర్పును తాము గౌరవించేది లేదని స్పష్టం చేసింది. ట్రిబ్యునల్‌ తీర్పును అమెరికా సమర్ధించడం తమపై నింద మోపేందుకు చేసే ప్రహసనమని చైనా ప్రతినిధి జావో లిజ్జియన్‌ విమర్శించారు. ఇటీవలే తమ సముద్ర జలాల్లోకి వచ్చిన యూఎస్‌ యుద్ధ నౌకను తరిమి కొట్టామని చైనా ప్రకటించింది. దక్షిన చైనా సముద్రంపై తమకు హక్కుందని చైనా వాదిస్తుండగా, అలాంటిదేమీ లేదంటూ అప్పుడప్పుడు యూఎస్‌ ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటుంది. ఈ విషయమై ట్రిబ్యునల్‌ తీర్పును గౌరవించాలని అమెరికా చెబుతుంటుంది.

ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్‌కు తమకు ద్వైపాక్షిక ఒప్పందాలున్నందున, దక్షిన చైనా జలాల్లో వాటాలకు సంబంధించి ఫిలిప్పీన్స్‌పై చైనా ఎలాంటి దాడి చేసినా, తాము జోక్యం చేసుకోక తప్పదని యూఎస్‌ స్టేట్‌ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ ఆదివారం హెచ్చరించారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చైనా తాజా వ్యాఖ్యలు చేసింది. తాము ఆ తీర్పును గౌరవించమని, ఎప్పటిలాగే ఈ జలాలపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దక్షిణ చైనా సముద్రంలోని పరాసెల్స్‌ దాదాపు వంద ద్వీపాల సముదాయం. వీటిపై చైనా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే దేశాలు చారిత్రకంగా తమకే హక్కు ఉందని చెప్పుకుంటున్నాయి. అయితే జులై 12, 2016లో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు దక్షిణ చైనా సముద్రంపై చారిత్రకంగా ఎలాంటి హక్కూ లేదని తీర్పునిచ్చింది. అంతేగాక, ఫిలిప్పీన్స్‌కు ఉన్న చేపలు పట్టే హక్కును ఉల్లంఘిస్తోందనీ, రెడ్‌ బ్యాంకు వద్ద చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం మైనింగ్‌ చేయడం ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని చైనా ఖాతరు చేయడం లేదని పేర్కొంది.  

మరిన్ని వార్తలు