అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా

26 Jan, 2022 16:00 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన 17ఏళ్ల యువకుడు మిరామ్ టారోర్‌ను విడుదల చేసేందుకు చైనా ఎట్టకేలకు ఒప్పుకుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం ప్రకటించారు. ఎప్పుడు ఆ పిల్లాడిని అప్పగిస్తారనేది తేదీ, సమయం త్వరలోనే తెలియజేస్తామని మంత్రి పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ)తో ఇండియన్‌ ఆర్మీ మాట్లాడుకున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా సానుకూలంగా స్పందించి తమ వద్ద ఉన్న యువకుడిని అప్పగిస్తామని చెప్పినట్లు తెలిపారు. ఎక్కడ అప్పగించాలో కూడా స్థలాన్ని సూచించిందని, అయితే దీనికి సంబంధించి త్వరలో తేదీ,, సమయం త్వరలోనే తెలియజేస్తారని అన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జాప్యం జరిగిందని కిరణ్ రిజుజు అన్నారు.

అంతకుముందు  తప్పిపోయిన యువకుడి ఆచూకీని గుర్తించిన భారత సైన్యం అతడి వ్యక్తిగత వివరాలు, ఫొటోలను చైనా ఆర్మీకి పంపించినట్లు మంత్రి రిజుజు చెప్పారు. కాగా, జనవరి 18న అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన పదిహేడేళ్ల మిరామ్ టారోన్ అనే యువకుడు బిషింగ్ ఏరియాలోని షియుంగ్ లా  ప్రాంతంలో  అదృశ్యమైన   విషయం తెలిసిందే. అప్పటినుంచి చైనానే ఆ యువకుడిని కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనంతరం  తమ భూభాగంలో ఒక భారతీయ బాలుడు దొరికాడని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించింది.
చదవండి: 17 Year Old Boy Miran Taron: ‘మిస్సింగ్‌’ మిరమ్‌ తరోన్‌ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన 

దీంతో యువకుడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారంటూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ తాపిర్ ఆరోపించారు. సాంగ్ పో నది అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట అతడిని కిడ్నాప్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సెప్టెంబరు 2020లో ఇలాంటి సంఘటన జరిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లా నుంచి ఐదుగురు యువకులను పీఎల్ఏ అపహరించి వారం తర్వాత వారిని విడుదల చేసింది. 
చదవండి: 2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!

మరిన్ని వార్తలు