Bird Flu Strain H10N3: చైనాలో మనుషులకీ బర్డ్‌ ఫ్లూ 

2 Jun, 2021 01:36 IST|Sakshi

 ప్రపంచంలోనే తొలి ‘హెచ్‌10ఎన్‌3’ వైరస్‌ కేసు నమోదు  

బీజింగ్‌: ప్రపంచంలో తొలిసారిగా బర్డ్‌ ఫ్లూ  వైరస్‌లో కొత్త స్ట్రెయిన్‌ మనుషులకి సోకడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడ్డాయి. చైనాలో ఈ వైరస్‌ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లో 41 ఏళ్ల వ్యక్తికి మే 28న బర్డ్‌ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్‌10ఎన్‌3 రకం’ సోకినట్టుగా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. అయితే అతనికి వైరస్‌ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది వంటివేవీ ఆరోగ్య శాఖ వెల్లడించలేదు. హెచ్‌10ఎన్‌3 వైరస్‌ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారిని మాత్రం పేర్కొంది.

మరోవైపు ఈ వైరస్‌తో వచ్చే ప్రమాదం ఏమీ లేదంటూ తక్కువగా చేసి చూపించే ప్రయత్నాలు డ్రాగన్‌ దేశం మొదలుపెట్టింది. పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్‌ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన ఆరోగ్య శాఖ  వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. బర్డ్‌ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రేపో మాపో డిశ్చార్జ్‌ చేసే అవకాశాలున్నాయంటూ  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీజీటీఎన్‌ టీవీ వెల్లడించింది.

ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన హెచ్‌5ఎన్‌8 రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువ. కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్‌ ముప్పు ఉండేది. ఇప్పుడు హెచ్‌10ఎన్‌3 రకం వైరస్‌ సోకడం ఆందోళన రేపుతోంది. జ్వరం వంటి సాధారణ ఫ్లూ లక్షణాలతో బాధపడుతూ వచ్చిన ఆ వ్యక్తికి పరీక్షల్లో బర్డ్‌ ఫ్లూ అని నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు