Chinas Ukraine Peace plan: యుద్ధం ఇక చాలు:చైనా.. ఉక్రెయిన్‌ హర్షం

24 Feb, 2023 20:29 IST|Sakshi

ఉక్రెయిన్‌ యుద్ధ విరమణకు శుక్రవారం చైనా పిలుపునిచ్చింది. ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై నేటికి(ఫిబ్రవరి 24) ఏడాది పూర్తైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ యుద్ధం విరమించేలా 12 పాయింట్ల సమగ్ర నివేదిక ఇచ్చింది చైనా. యుద్ధం ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిందని.. వేల మంది మరణించారని, మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని చైనా సదరు నివేదిక ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేసింది. 

పనిలో పనిగా.. అగ్రరాజ్యంపైనా చైనా ఆగ్రహం వెల్లగక్కింది. యుద్ధం తీవ్రత పెరిగేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా కారణమయ్యాయని నివేదికలో చైనా విమర్శలు గుప్పించింది. అయితే తాము మాత్రం ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు చైనా తెలిపింది. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారమని నొక్కి చెప్పింది చైనా. 

అంతేగాదు ఆ 12 పాయింట్‌ పొజిషన్‌ పేపర్‌లో(సమగ్ర నివేదికలో)..‘‘అణ్వాయుధాలను ఉపయోగించకూడదు, అలాగే అణుయుద్ధాలను చేయకూడదు, బెదిరింపులకు పాల్పడకూడదు. చివరిగా . ఏ దేశమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయన, జీవ ఆయుధాల పరిశోధన, అభివృద్ధి, వినియోగాన్ని వ్యతిరేకించాలి’’ అని చైనా తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. చైనా నివేదికపై ఉక్రెయిన్‌హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనాలోని ఉక్రెయిన్‌ రాయబారి ఇదొక శుభపరిణామంటూ పేర్కొన్నారు. అలాగే.. రష్యాపై చైనా ఒత్తిడి తెస్తుందని ఆశిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

(చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: కీలక ఓటింగ్‌కు భారత్, చైనా దూరం)

మరిన్ని వార్తలు