చైనా కక్ష పూరిత చర్య.. ఆంక్షల మోత!

16 Aug, 2022 09:53 IST|Sakshi

చైనా: అమెరికా సభ ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటన చైనాకి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. ఆఖరికి అమెరికా దిగొచ్చి కేవలం తమ డెమెక్రెటిక్‌ కాంగ్రెస్‌ సభ్యుల పర్యటన అని చైనాని బుజ్జగింపు ప్రయత్నం చేసింది. అయినా ససేమిరా అంటూ తైవాన్‌పై పదే పదే ద్వేషపూరిత చర్యలకు దిగుతోంది చైనా. అదీగాక ఆది నుంచి ప్రజాస్వామ్యయుతంగా స్వయంపాలనలో ఉన్న తైవాన్‌ సార్వభౌమాధికారాన్ని తిరస్కరిస్తూ వస్తోంది చైనా.

ప్రస్తుతం ఈ యూఎస్‌ అత్యన్నతాధికారి నాన్సీ పర్యటనతో తీవ్ర ఆగ్రహోజ్వాలతో రగలిపోతుంది చైనా. అందులో భాగంగా చైనా తాజగా ఏడుగురు తైవాన్‌ అధికారులపై ఆంక్షలు విధించింది. వారంతా తైవాన్‌ స్వాతంత్య్రానికి మద్ధతిచ్చినందుకే చైనా ఈ ఆంక్షలు విధించింది. ఈ మేరకు చైనా అంక్షలు విధించిన  తైవాన్‌ వ్యవహారాల కార్యాలయం అధికారుల్లో వాషింగ్టన్‌​లోని తైవాన్‌ రాయబారి హ్సియావో బిఖిమ్‌ , తైవాన్‌ జాతీయ భద్రతా మండలి సెక్రటరీ జనరల్‌ వెల్లింగ్టన్‌ కూ ఉన్నారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది.

అంతేగాక తైవాన్‌ అధికార రాజకీయ పార్టీ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పై కూడా ఆంక్షలు విధించింది. దీంతో ఆయా అధికారులంతా హాంకాంగ్‌, మకావులను పర్యటించలేరని తైవాన్‌ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు ఆయా సంస్థల పెట్టుబడు దారులు కూడా చైనాలో లాభం పొందేందుకు కూడా అనుమతించదని స్పష్టం చేశారు. ఈ ఏడుగురు అధికారుల తోపాటు అదనంగా మరో ముగ్గురు అధికారులు తైవాన్‌ ప్రీమియర్‌ సుత్సెంగ్‌ చాంగ్‌, విదేశాంగ మంత్రి జోసెఫ్‌ వు, పార్లమెంట్‌ స్పీకర్‌ సికున్‌ల పై కూడా ఆంక్షలు విధించినట్లు తైవాన్‌ పేర్కొంది. 

(చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం)

మరిన్ని వార్తలు