తైవాన్‌ పర్యటనతో కన్నెర్ర.. నాన్సీ పెలోసీపై ఆంక్షలు విధించిన చైనా

5 Aug, 2022 16:00 IST|Sakshi

బీజింగ్‌: అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యాటనపై ముందు నుంచే మండిపడుతోంది చైనా. అయినప్పటికీ.. తైపీలో పర్యటించారు పెలోసీ. దీంతో అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్‌ దేశం. తాజాగా స్పీకర్‌ నాన్సీ పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించినట్లు చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. 

‘చైనా తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా పెలోసీ తైవాన్‌లో పర్యటించారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో కలుగ జేసుకోవటం తీవ్రమైన అంశం. చైనా సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత, ఒకే చైనా పాలసీని అణచివేయటమే. అలాగే.. తైవాన్‌లో శాంతి, సామరస్యాన్ని ఆందోళనలో పడేశారు. దాంతో పెలోసీ, ఆమె కుటుంబ సభ్యులపై బీజింగ్‌ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది.’అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటన చేశారు. 

చైనాలోని షింజియాంగ్‌, హాంగ్‌కాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, డ్రాగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో ఇటీవల పలువురు అమెరికా అధికారులపై ఆంక్షలు విధించింది. అమెరికా అధికారుల వీసాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఈఏడాది మార్చిలో ప్రకటించింది చైనా. ఈ జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవరోవ్‌లు ఉన్నారు. చైనాలోకి ప్రవేశించకుండా, చైనాతో ఎలాంటి వ్యాపారాలు చేయకుండా ఈ ఆంక్షలు ఉన్నాయి.

ఇదీ చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్‌

మరిన్ని వార్తలు