ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు విఘాతం : డ్రాగన్‌

3 Sep, 2020 14:42 IST|Sakshi

యాప్‌ల నిషేధంపై చైనా స్పందన

న్యూఢిల్లీ : పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడంపై డ్రాగన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. మొబైల్‌ యాప్‌లపై నిషేధం నిర్ణయంతో చైనా ఇన్వెస్టర్లు, సర్వీస్‌ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలను భారత్‌ ఉల్లంఘించిందని ఆరోపించింది. చైనా మొబైల్‌ యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని, భారత్‌ నిర్ణయం విచారకరమని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో ఫెంగ్‌ అన్నారు. దేశ భద్రతకు ముప్పుగా మారడంతో పాటు డేటా గోప్యత ఆందోళనలపై పబ్జీ సహా 118 చైనా యాప్‌లను భారత్‌ బుధవారం నిషేధించిన సంగతి తెలిసిందే.

నిషేధిత మొబైల్‌ యాప్‌ల జాబితాలో బైడు, బైడు ఎక్స్‌ప్రెస్‌ ఎడిషన్‌, అలీపే, టెన్సెంట్‌ వాచ్‌లిస్ట్‌, ఫేస్‌యూ, విచాట్‌ రీడింగ్‌, క్యామ్‌కార్డ్‌ సహా పలు యాప్‌లున్నాయి. తాజా నిషేధంతో భారత్‌ నిషేధించిన చైనా యాప్‌ల సంఖ్య 224కు పెరిగింది. భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో పబ్జీ సహా 118 చైనా యాప్‌లపై భారత్‌ నిషేధించడం గమనార్హం. గతంలో జూన్‌ 29న టిక్‌టాక్‌, యూసీ బ్రౌజర్‌ సహా 59 చైనా యాప్‌లను ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. లడఖ్‌లో చైనా దళాలతో ఘర్షణ నేపథ్యంలో అప్పట్లో భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి : పబ్‌జీ ‘ఆట’కట్టు

మరిన్ని వార్తలు