గుట్టలు గుట్టలుగా శవాలు.. అయినా కరోనాతో ఒక్కరూ చనిపోలేదట.. చైనా జిత్తులమారి లెక్కలు..

21 Dec, 2022 12:26 IST|Sakshi

బీజింగ్‌: చైనాలో కరోనా ఆంక్షలు ఎత్తివేసినప్పటి నుంచి కేసులు విపరీతంగా పెరిగాయి. రోజు వేల మంది వైరస్ బారినపడుతున్నారు. వందల మంది చనిపోతున్నారు. ఆస్పత్రుల్లో రోగులు కిక్కిరిసిపోతున్నారు. శ్మశాన వాటికల్లో శవాలు గట్టలుగుట్టలుగా కన్పిస్తున్నాయి.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. చైనా లెక్కలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కరోనా వల్ల మంగళవారం ఒక్కరు కూడా చనిపోలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ బుధవారం అధికారిక ప్రకటనలో తెలిపింది. సోమవారం ఐదుగురే మరణించారని పేర్కొంది. ఇప్పటివరకు మొత్తం 5,241 మంది మాత్రమే వైరస్ కారణంగా చనిపోయినట్లు చెబుతోంది. 

మంగళవారం కొత్తగా 3,101 మందికి వైరస్ సోకిందని చైనా వెల్లడించింది. వీరిలో 52 మంది విదేశాల నుంచి వచ్చిన వారని పేర్కొంది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి చైనాలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 3,86,276కి చేరిందని పేర్కొంది.

అయితే చైనా లెక్కలకు వాస్తవ పరిస్థితుల వ్యత్యాసానికి కారణం ఉంది. ప్రపంచంలోని అన్ని దేశాలు కరోనా సోకిన వారు దుష్ప్రభావాలు లేదా మరే ఇతర కారణంతో చనిపోయినా దాన్ని కోవిడ్ మరణాల కిందే లెక్కకడుతున్నాయి. చైనాలో మాత్రం నిబంధనలు మరోలా ఉన్నాయి. వైరస్‌ సోకి శ్వాసకోస వ్యవస్థ దెబ్బతిని చనిపోయిన వారిని మాత్రమే కరోనా మృతులుగా గుర్తిస్తోంది. వైరస్‌ సోకి మిగతా ఏ కారణంతో చనిపోయినా.. వారిని కోవిడ్ మృతులుగా గుర్తించడం లేదు. అలాగే లక్షణాలు ఉంటేనే కరోనా కేసుగా లెక్కగడుతోంది.

చైనాలోని ఓ ఆస్పత్రిలో శవాలు

ఈ కారణంగానే చైనాలో రోజుకు ఎంతమంది చనిపోయినా.. అధికారిక కరోనా మరణాల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ నిపుణుల అంచనాల ప్రకారం చైనాలో ప్రస్తుతం రోజుకు 40వేల కరోనా  కేసులు వెలుగు చూస్తున్నాయి. వందల మంది వైరస్‌కు బలవుతున్నారు. అక్కడ ఆస్పత్రులు కూడా పడకల ఖాళీ లేనంత రద్దీగా మారాయి. శవాలను ఖననం చేసేందుకు శ్మశానవాటికల్లో ఖాళీ కూడా లేని దుస్థితి ఉంది.
చదవండి: ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్‌లైన్‌ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు