కరోనా మరణాలను దాచిపెట్టేందుకు చైనా ఎత్తుగడ.. కొత్త నిబంధనలు జారీ

20 Dec, 2022 21:16 IST|Sakshi

బీజింగ్‌: ప్రజాగ్రహంతో కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసింది చైనా. ఈ క్రమంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. రానున్న 3 నెలల్లో దేశంలోని 60 శాతం మంది వైరస్‌ బారినపడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈక్రమంలో కోవిడ్‌ ద్వారా సంభవించే మరణాలను దాచిపెట్టేందుకు డ్రాగన్‌ దేశం కొత్త ఎత్తుగడ వేసింది. శ్వాసకోశ అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా కోవిడ్‌ మరణాలుగా పరిగణిస్తామని మంగళవారం ప్రకటించింది. ఆంక్షల సడలింపు తర్వాత మంగళవారం అత్యధికంగా 5 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. అయితే, అది అధికారిక లెక్కప్రకారమే. కానీ, ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

ఆరోగ్య శాఖ ప్రకారం చైనాలోని ప్రధాన నగరాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్లు బీఏ.5.2, బీఎఫ్‌.7లు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌(ఎన్‌హెచ్‌సీ) ఈ ప్రకటన చేసింది. కేవలం శ్వాసకోశ సంబంధిత అవయవాల వైఫల్యంతో మరణించిన వారినే అధికారికంగా లెక్కల్లోకి తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు ఏ విధంగా లెక్కిస్తామనే అంశాలపై నోటీసులు జారీ చేసింది. సైంటిఫిక్‌, రియలిస్టిక్‌ పద్ధతిలో ఆ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో కరోనా సోకిన తర్వాత గుండెపోటు, ఇతర వ్యాధులతో మరణించిన వారిని లెక్కల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

మరిన్ని వార్తలు