WHO: నిర్ణయం షాక్‌కు గురి చేసింది: చైనా

22 Jul, 2021 13:30 IST|Sakshi

కరోనా మూలాలపై పరిశోధన కోసం మరోసారి చైనాలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం పర్యటన

బీజింగ్‌: ప్రపంచాన్ని ఒణికిస్తున్న కరోనా చైనాలోనే జన్మించిందని.. డ్రాగన్‌ దేశం వుహాన్‌ ల్యాబ్‌లో మహమ్మారిని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలిందని పలు దేశాలు ఆరోపణలు చేశాయి. ఇక కరోనా గురించి హెచ్చరించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) విఫలమయ్యిందని.. చైనాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభంలో డబ్ల్యూహెచ్‌ఓ బృందం కరోనా మూలాల గురించి పరిశోధించేందుకు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీకైందన్న కొనసాగుతున్న అనుమానాల నివృత్తికి  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మరోసారి విచారణకు సిద్ధమవడాన్ని చైనా పూర్తిగా వ్యతిరేకించింది. రెండోసారి విచారణకు అనుమతించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వూహాన్‌ నగరం, ఆ తర్వాత ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందడానికి ముందు వూహాన్‌ ల్యాబ్‌లో ఉద్యోగులకు కరోనా సోకిందని వచ్చిన వార్తల్ని తోసి పుచ్చింది.

కోవిడ్‌–19 పుట్టుకపై రెండో విడత వూహాన్‌ ల్యాబ్‌లో విచారణకు అనుమతినివ్వబోమని నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) ఉప మంత్రి జెంగ్‌ ఇక్సిన్‌ గురువారం విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. తమ దేశం ల్యాబ్‌ నిబంధనలను ఉల్లంఘించిందని, అందుకే వైరస్‌ లీక్‌ అయిందంటూ జరుగుతున్న ప్రచారం తమని షాక్‌కి గురి చేస్తోందని జెండ్‌ అన్నారు. డబ్ల్యూహెచ్‌వో రెండోసారి విచారణకు సన్నాహాలు చేయడం సైన్స్‌ను అగౌరవపరిచేలా ఉందని ఆయన మండిపడ్డారు.

శాస్త్రీయమైన ఆధారాలను అగౌరవ పరుస్తూ, రాజకీయ ఒత్తిళ్లకి తలొగ్గి డబ్ల్యూహెచ్‌వో మరోసారి ల్యాబ్‌ థియరీపై విచారణ జరుపుతానని అంటోందని ఆరోపించారు. ఈ ఏడాది మొదట్లో డబ్ల్యూహెచ్‌వో అ«ధికారులు అందరూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లడానికి అంగీకరించామని, చైనాలో ఉండి వారంతా  శాస్త్రవేత్తలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారని, ల్యాబ్‌ నుంచి వైరస్‌ లీకయినట్టు ఆధారాలు లభించలేదని గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు