భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి: చైనా

8 Dec, 2020 19:12 IST|Sakshi
హువా చున్‌యింగ్‌ (ఫైల్‌ ఫొటో)

బీజింగ్‌: సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయేలా భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని చైనా పేర్కొంది. ఉద్రిక్తతలు చల్లారిపోయేలా ఇరు దేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయని, త్వరలోనే ఇందుకు పరిష్కారం కనుగొంటామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చున్‌యింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ చైనా- భారత్‌ల మధ్య దౌత్యపరమైన, మిలిటరీ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య కుదిరిన ఏకాభిప్రాయాల అమలుపై తదుపరి విధివిధానాలు ఆధారపడి ఉంటాయి’’అని పేర్కొన్నారు.(చదవండి: సరిహద్దుల్లో డ్రాగన్‌ మరో కుట్ర)

కాగా ఈ ఏడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో డ్రాగన్‌ ఆర్మీ దురాగతానికి సుమారు 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం విదితమే. వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైనికులు ప్రయత్నించగా, కల్నల్‌ సంతోష్‌ బాబు నేతృత్వంలోని భారత బృందం వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆనాటి నుంచి తూర్పు లదాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే 8 సార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. నవంబరు 6న చివరిసారిగా ఇరు దేశాల కార్‌‍్ప్స కమాండర్‌ స్థాయి అధికారులు భేటీ అయ్యారు.

మరిన్ని వార్తలు