భారత్‌ వ్యూహంతో నిఘా నౌకకు చెక్‌.. చైనా ఉక్కిరిబిక్కిరి!

7 Aug, 2022 20:15 IST|Sakshi

కొలంబో: శ్రీలంకలోని హంబన్‌టోటా నౌకాశ్రయానికి నిఘా నౌక రాకుండా చేసిన భారత్‌ వ్యూహంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. తాము అనుకున్న పనికి ఆటంకం ఏర్పడటంతో ఆందోళన చెందుతోంది. భారత్‌ ఒత్తిడి మేరకు నిఘా నౌక పర్యటనను నిరవధికంగా వాయిదా వేసుకోమని చైనాకు శ్రీలంక అభ్యర్థించింది. ఎలాగూ శ్రీలంక మన మాట కాదనదులే అనుకుని ప్రయాణం ప్రారంభించిన నౌక ప్రస్తుతం శ్రీలంకకు సమీపంలోని మార్గం మధ్యలో ఉంది. దీంతో శ్రీలంకతో అత్యవసర సమావేశానికి సిద్ధమైంది చైనా. కొలంబోలోని చైనా రాయబార కార్యాలయం.. శ్రీలంక ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. 

మరోవైపు.. ఈ విషయంపై శ్రీలంక అధ్యక్షుడు రణీల్‌ విక్రమసింఘే చైనా రాయబారి కిజెన్‌హోంగ్‌తో ప్రత్యేకంగా సమావేశమైనట్లు కొలంబో మీడియా పోర్టల్స్‌ పేర్కొన్నాయి. తదుపరి కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. అయితే.. ఈ సమావేశంపై మీడియాలో వచ్చిన వార్తలను అధ్యక్ష కార్యాలయం ఖండించింది.

యువాన్‌వాంగ్‌ 5 రెండు రకాలగా ఉపయోగపడే గూఢచారి నౌక, పైగా దీన్ని అంతరిక్ష ఉపగ్రహ ట్రాకింగ్‌తోపాటు ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలలోనూ వినియోగిస్తారు. అయితే ఈ నౌక తమ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు చైనా ఉపయోగిస్తుందేమోనని భారత్‌ తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ విషయమై కొలంబోలో ఫిర్యాదు చేసింది కూడా. అదీగాక భారత్‌కి పొరుగున ఉన్న శ్రీలంక నుంచి చైనా బలపడుతుందేమోనని అనుమానిస్తోంది.

ఇదీ చదవండి: భారత్‌కు హామీ ఇచ్చిన శ్రీలంక...చైనా నౌకకు చెక్‌!

మరిన్ని వార్తలు