కరోనా ఎఫెక్ట్‌: ఎవరెస్ట్‌పై చైనా విభజన రేఖ

10 May, 2021 19:19 IST|Sakshi

కోవిడ్‌ కట్టడి కోసం డ్రాగన్‌ ప్రయత్నం

బీజింగ్‌: కోవిడ్‌ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని విభిన్న మార్గాలు అనుసరిస్తుండగా.. తాజాగా చైనా ఎవరెస్ట్‌ పర్వతంపై విభజన రేఖ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఎందుకంటే నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ అధిరోహిచండానికి వచ్చే పర్వతారోహకులు తమ దేశంలో ప్రవేశించడం వల్ల కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని చైనా భావిస్తోంది. దీన్ని కట్టడి చేయడం కోసం చైనా ఎవరెస్ట్‌ శిఖరంపై విభజన రేఖ ఏర్పాటు చేయనుందని డ్రాగన్‌ జాతీయ మీడియా తెలిపింది. 

నేపాల్‌ నుంచి ఎవరెస్ట్‌ అధిరోహించడానికి వస్తున్న వారిలో చాలా మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. విభజన రేఖ ఏర్పాటు వల్ల పర్వతారోహకులు చైనాలోని ఎవరెస్ట్‌ ఉత్తర దిశగా పర్వతాన్ని ఎక్కడాన్ని నిరోధిస్తుంది. అంతేకాక సరిహద్దును దాటడం.. నేపాల్ వైపు, ఎవరితోనైనా.. ఏ వస్తువులతోనైనా సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధిస్తుంది.

ప్రస్తుతం చైనాలో స్థానికంగా వ్యాప్తి అవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినప్పటికి.. వేరే దేశాల నుంచి వచ్చే వారి ద్వారా నమోదవుతున్న కోవిడ్‌ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా నేపాల్‌లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అధిరోహకులు చైనా వైపు నుంచి శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే ముందే.. టిబెటన్ పర్వతారోహణ మార్గదర్శకుల బృందం శిఖరం వద్ద విభజన రేఖను ఏర్పాటు చేస్తుందని అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. 

అయితే విభజన రేఖను ఎలా గీస్తారు.. ఏ ప్రామాణికాల ప్రకారం ఏర్పాటు చేస్తారు అనే దాని గురించి నివేదిక స్పష్టం చేయలేదు. భారతదేశం, చైనా మధ్య హిమాలయపర్వత సానువుల్లో ఉన్న  చాలా ప్రధాన నగరాలు, పట్టణాల్లో లాక్‌డౌన్‌ విధించారు. దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు.

చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా క‌రోనా

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు