చైనా అంతరిక్ష కేంద్రానికి మరో ముగ్గురు

5 Jun, 2022 03:41 IST|Sakshi

నింగిలోకి వ్యోమగాములను పంపనున్న చైనా

బీజింగ్‌: చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనుల్లో భాగస్వాములను చేసేందుకు మరో ముగ్గురు వ్యోమగాములను ఆదివారం నింగిలోకి పంపనుంది. తియాంగాంగ్‌ స్పేష్‌ స్టేషన్‌కు వ్యోమగాములు చెన్‌ డాంగ్, లీయాంగ్, కాయ్‌ క్సుజీలను షెంజూ–14 వ్యోమనౌక ద్వారా నింగిలోకి పంపుతున్నట్లు చైనా మానవసహిత స్పేస్‌ ఏజెన్సీ(సీఎంఎస్‌ఏ) శనివారం పేర్కొంది. గన్సులోని జిక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి జరిగే ఈ ప్రయోగం ద్వారా రెండు ల్యాబ్‌ మాడ్యుల్స్‌ వెంటియాన్, మెంగ్‌టియాన్‌లను నింగిలోకి పంపుతారు. అక్కడికి వీటిని తీసుకెళ్లాక వాటిలో డజనుకుపైగా శాస్త్రీయ ప్రయోగ క్యాబినెట్లను అమర్చుతారు.

వచ్చే ఆరు నెలలపాటు వారు చైనా స్పేస్‌స్టేషన్‌(సీఎస్‌ఎస్‌)లోనే గడుపుతారు. ఇప్పటికే ముగ్గురు వ్యోమగాములు అక్కడికి వెళ్లగా ఏప్రిల్‌లో ఒక మహిళా వ్యోమగామి తిరిగి భూమిని చేరుకుంది. ఈ ఏడాది చివరికల్లా మొత్తం అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ముందుగా వెళ్లిన ఆ ముగ్గురు అక్కడ కీలక స్పేస్‌ టెక్నాలజీల పనితీరును పునఃపరీక్షించారు. రష్యా సాయంతో నిర్మితమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) భవిష్యత్‌లో నిర్వీర్యమైతే చైనా స్పేస్‌ స్టేషన్‌(సీఎస్‌ఎస్‌) ఒక్కటే మానవనిర్మిత కేంద్రంగా రికార్డులకెక్కనుంది. ఈ ఏడాది మొత్తంగా సీఎస్‌ఎస్‌కు 140 ఉపకరణాలు పంపేందుకు 50 అంతరిక్ష ప్రయోగాలు చైనా చేపట్టనుంది. 

మరిన్ని వార్తలు