Covid Effect: కరోనా కారణంగా చైనాలో విపత్కర పరిస్థితులు.. వీడియో వైరల్‌

15 Apr, 2022 17:30 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ కారణంగా డ్రాగన్‌ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్‌ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డుతున్నారు. 

వివరాల ప్రకారం.. కరోనా వైరస్‌ కారణంగా షాంఘైలో క‌ఠిన ఆంక్ష‌లు అమలవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘ‌ర్ష‌ణ‌కు దారి తీశాయి. పీపీఈ కిట్‌ ధరించి ఓ వీధికి వ‌చ్చిన పోలీసులు.. అక్క‌డ ఉన్న నివాసితుల ఇండ్ల‌ను స‌రెండ‌ర్ చేయాల‌ని కోరారు. ఆ స‌మ‌యంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ల‌లో పెట్టేందుకు పోలీసులు ముంద‌స్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క‍్రమంలో ఓ మహిళ.. త‌మ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నార‌ని ఆరోపించింది. దీంతో త‌మ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇదిలా ఉండగా.. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్‌ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు