ప్రముఖ సింగర్‌ అత్యుత్సాహం.. కావాలనే కరోనా తెచ్చుకుని ఆపై క్షమాపణలు

21 Dec, 2022 21:15 IST|Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్‌ బారినపడకుండా ఉండేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ, చైనాకు చెందిన ప్రముఖ సింగర్‌, పాటల రచయిత జేన్‌ జాంగ్‌ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కోవిడ్‌ తనకు సోకేలా చేసుకుంది. తాను కావాలనే కరోనా బారినపడినట్లు బయటకు చెప్పడంతో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ వైపు చైనాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న తరుణంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే కోవిడ్‌ బారినపడటం విమర్శలపాలు చేసింది. 

అయితే, తాను కరోనా బారినపడేందుకు గల కారణాలను సోషల్‌ మీడియా వేదికగా వివరించింది సింగర్‌ జేన్‌ జాంగ్‌. కరోనా సోకిన తన స్నేహితులను చూసేందుకు వెళ్లినట్లు పేర్కొంది. కొత్త ఏడాది ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే ప్రక్రియలో భాగంగానే కరోనా తనకు అంటుకునేలా చేసుకున్నానని పేర్కొంది. ఇప్పడే వైరస్‌ సోకి కోలుకోవడం ద్వారా న్యూఇయర్‌ ఈవెంట్‌లో మళ్లీ వైరస్‌ సోకదని భావించినట్లు పేర్కొంది. ‘న్యూఇయర్‌ కన్సర్ట్‌లో నా ఆరోగ్యం దెబ్బతింటే అది నా ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందాను. అందుకే కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారితో కలిశాను. ఇప్పుడు నాకు కోలుకునేందుకు తగిన సమయం ఉంది.’ అని రాసుకొచ్చింది జేన్‌ జాంగ్‌. కోవిడ్‌ సోకిన వారిలాగే తనకు లక్షణాలు కనిపించాయని, కానీ, ఒక్కరోజు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. పగలు, రాత్రి నిద్రపోవటం వల్ల లక్షణాలు మాయమైనట్లు పేర్కొంది. విటమిన్‌ సీ తీసుకోవటం, నీళ్లు ఎక్కువ తాగడం వంటివి చేసినట్లు వెల్లడించింది.

విమర్శల వెల్లువ..క్షమాపణలు
సింగర్‌ పోస్ట్‌ వైరల్‌గా మారిన క్రమంలో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. చైనాలో కోవిడ్‌ విజృంభణ వేళ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. దీంతో సోషల్‌ మీడియా నుంచి తన వివాదాస్పద పోస్ట్‌ను తొలగించింది సింగర్‌ జేన్‌ జాంగ్‌. ప్రజలకు క్షమాపణలు తెలిపింది. న్యూఇయర్‌ ఈవెంట్‌లో కరోనా సోకితే తనతో పాటు సిబ్బందికి సోకుతుందని అంతా ఇబ్బందులు పడతారనే కారణంతోనే ఇలా చేశానని, ప్రస్తుతం ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేనందున వైరస్‌ నుంచి కోలుకుంటే ఇబ్బందులు ఉండవని భావించినట్లు రాసుకొచ్చింది.

ఇదీ చదవండి: Covid BF7 Variant: కొత్త వేరియంట్‌ భారత్‌లోనూ గుర్తింపు.. ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌

మరిన్ని వార్తలు