సినోవాక్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర అనుమతి

2 Jun, 2021 13:17 IST|Sakshi

బీజింగ్‌/జెనీవా: చైనాకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీ సినోవాక్‌ తయారుచేసిన సినోవాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం అత్యవసర అనుమతులిచ్చింది. చైనా నుంచి ఇప్పటికే సైనోఫార్మ్‌ వ్యాక్సిన్‌ డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. సినోవాక్‌ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నందునే అనుమతులు ఇచ్చినట్లు ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వ్యాక్సిన్ల లోటు ఏర్పడిన తరుణంలో మరిన్ని వ్యాక్సిన్లు ఉండటం అత్యవసరమని డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య ఉత్పత్తుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మరియాంజెలా సిమానో తెలిపారు. కోవ్యాక్స్‌ ఫెసిలిటీ ద్వారా ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్లను అందించాల్సిందిగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి కంపెనీలను ఆమె కోరారు. ప్రపంచంలోని పేద దేశాలకు కోవ్యాక్స్‌ ద్వారా ఉచిత వ్యాక్సిన్లను అందిస్తోన్న సంగతి తెలిసిందే. మే 7న చైనాకు చెందిన సైనోఫార్మ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే.

(చదవండి: వైరల్‌: 12 ఏళ్ల నాటి సీసీటీవీ ఫుటేజీ.. కలవరపడుతున్న నెటిజన్లు)

మరిన్ని వార్తలు