తారస్థాయికి విభేదాలు: అమెరికాకు చైనా వార్నింగ్‌!

5 Apr, 2021 17:13 IST|Sakshi
అలస్కా సమావేశం నాటి ఫొటో

బీజింగ్‌: అమెరికా- చైనాల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ డ్రాగన్‌ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికే తాము ప్రాధాన్యం ఇస్తామని, అయితే అదే సమయంలో తమపై పెత్తనం చెలాయించాలని చూస్తే మాత్రం సహించబోమని పునరుద్ఘాటించారు. పరస్పర గౌరవం, సమానత్వ భావనతో మెలగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అగ్రరాజ్యం- డ్రాగన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అయితే, జో బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపించాయి. 

కానీ, ఇటీవల అలస్కాలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టోనీ బ్లింకెన్‌,  వాంగ్‌ యీ మధ్య జరిగిన మొట్టమొదటి భేటీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. జిన్‌జియాం‍గ్‌, హాంకాంగ్‌, తైవాన్‌ విషయంలో చైనా అవలంబిస్తున్న విధానాలు, ప్రపంచ స్థిరతకు భంగకరంగా మారాయని అమెరికా తీవ్ర ఆరోపణలు చేసింది. చైనా సైతం..  తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని గట్టిగా ఎదుర్కొంటామంటూ దీటుగానే బదులిచ్చింది. ఈ నేపథ్యంలో వాంగ్‌ యీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకొంటూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తూ, తమ మాటే శాసనం అనే వైఖరిని చైనా ఎన్నటికీ అంగీకరించబోదు. ముఖ్యంగా మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించం. 

అంతేకాదు, తప్పుడు సమాచారం, అసత్యాల ఆధారంగా చట్టవ్యతిరేకంగా, ఏకపక్షంగా ఆంక్షలు అమలు చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’’ అని అమెరికాను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు కథనం వెలువరించింది. కాగా అలస్కా సమావేశంలో భాగంగా, జిన్‌జియాంగ్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరుతోందన్న ఆరోపణలతో, చైనా అధికారులు, వస్తువులపై మరిన్ని ఆంక్షలు విధించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా ముదిరిన నేపథ్యంలో వాంగ్‌ యీ ఈ మేరకు స్పందించడం గమనార్హం.

చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్!
బద్ధశత్రువులతో వేదికను పంచుకోనున్న భారత్‌

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు