కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..

10 Jan, 2023 17:04 IST|Sakshi

బీజింగ్: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి దక్షిణ కొరియా, జపాన్. అయితే ఈ దేశాల తీరుపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగింది.

తమ దేశస్థులపై కరోనా ఆంక్షలు విధించినందుకు బదులుగా దక్షిణ కొరియా దేశస్థులకు షార్ట్ టర్మ్ వీసాల జారీని సస్పెండ్ చేసింది చైనా. సియోల్‌లోని చైనా ఎంబసీ మంగళవారం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అలాగే జపాన్ దేశస్థులపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. 

చైనా తీరును చూస్తుంటే ప్రతీకార చర్యల్లో భాగంగానే వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో తమపై కొన్ని దేశాలు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని డ్రాగన్ దేశం ఇదివరకే తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా కక్షపూరిత చర్యలకు దిగుతోంది.

చైనాలో జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేల మంది చనిపోయి శ్మశానాల్లో ఖాళీ లేని పరిస్థితి. చైనా మాత్రం కరోనా కేసుల లెక్కలను వెల్లడించలేదు. కోవిడ్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తేసింది. ఈనేపథ్యంలోనే అమెరికా, భారత్ సహా పలు దేశాలు చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి.

మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత సరిహద్దులను ఆదివారం తెరిచింది చైనా. కరోనా కేసులు వెలుగు చూసిన తొలినాళ్లలో వీటిని మూసివేసింది. అన్నిదేశాలు ఎప్పుడో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ చైనా మాత్రం డిసెంబర్ 7న జీరో కోవిడ్ పాలసీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. తాజాగా ఇతర దేశాలతో సరిహద్దులను కూడా తెరిచింది.
చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్..

మరిన్ని వార్తలు