నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు

17 Oct, 2020 04:23 IST|Sakshi

బీజింగ్‌: చైనాలోని కింగ్‌డావ్‌ హాస్పిటల్‌లో జరిగిన చిన్న నిర్లక్ష్యపూరిత తప్పిదానికి దాదాపు కోటి మందికి కరోనా టెస్టులు చేయాల్సివచ్చిందని సీనియర్‌ ఆరోగ్య అధికారి ఒకరు చెప్పారు. అయితే ఇంతవరకు వీరిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదన్నారు. కింగ్‌డావ్‌ ఆస్పత్రి సీటీ రూమ్‌లో డిసిన్‌ఫెక్షన్‌ సరిగా చేయకపోవడంతో ఆస్పత్రి కరోనాకు కొత్త క్లస్టర్‌గా మారిందని తెలిపారు. కానీ ఈ తప్పిదంతో ఎవరికీ కొత్తగా కరోనా సోకలేదని, ఇకపై క్రాస్‌ ఇన్‌ఫెక్షన్‌తో కొత్త కేసులు వచ్చే అవకాశాలు కూడా ఉండకపోవచ్చని తెలిపారు.

కింగ్‌డావ్‌లో కొత్త క్లస్టర్‌ ఏర్పడడం దేశవ్యాప్తంగా కలవరం సృష్టించింది. ఈ నగరాన్ని ఇటీవలి సెలవు దినాల్లో వేలాది మంది సందర్శించారు. దీంతో వీరందరికీ కోవిడ్‌ ముప్పు ఉండొచ్చన్న అనుమానాలు పెరిగాయి. అందుకే భారీ స్థాయిలో కోవిడ్‌ టెస్టులు నిర్వహించారు. ఇప్పటివరకు 1.04 కోట్ల శాంపిళ్లు సేకరించామని, వీటిలో 88 లక్షల శాంపిళ్ల ఫలితాలు వచ్చాయని అధికారులు చెప్పారు. శుక్రవారానికి 1.1 కోట్ల మందికి టెస్టులు నిర్వహించడం పూర్తవుతుందన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యానికిగాను కింగ్‌డావ్‌ హెల్త్‌ కమీషన్‌ డైరెక్టర్‌ సుయిజెన్హువాను సస్పెండ్‌ చేశారు. పల్మనరీ ఆస్పత్రి డీన్‌ డెంగ్‌ కైను పదవి నుంచి తొలగించారు.  

ప్రజలకు అందుబాటులో టీకా
చైనాలోని జియాజింగ్‌ నగరంలోని కొందరు పౌరులకు ప్రయోగాత్మకంగా కరోనా టీకాను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న, టీకా అత్యంత అవసరమైన వారు ఈ సైనోవాక్‌ బయోటెక్‌ టీకా కోసం స్థానిక క్లినిక్‌లలో సంప్రదించాలని జియాజింగ్‌ అధికారులు గురువారం  ప్రకటించారు. ఈ టీకాను ఇప్పటికే వైద్యసిబ్బంది సహా వైరస్‌ ముప్పు అధికంగా ఉన్న వారికి ఇచ్చినట్లు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎంతమందికి ఈ టీకా ఇచ్చారనే విషయం కానీ, టీకా దుష్ఫలితాల విషయం కానీ వారు వెల్లడించలేదు. ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో 2 డోసుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ టీకా ధర 400 యువాన్లు(రూ. 4332)గా నిర్ధారించారు. చైనాలో ప్రస్తుతం 11 టీకాలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. వాటిలో నాలుగు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఏ టీకా కూడా పూర్తి స్థాయిలో ప్రజాబాహుళ్య వినియోగానికి అనుమతులు పొందలేదు.

మరిన్ని వార్తలు