చైనాపై భగ్గుమన్న యూరప్‌

3 Sep, 2020 15:31 IST|Sakshi

చెక్‌ నేత తైవాన్‌ పర్యటనపై డ్రాగన్‌ ఫైర్‌

బీజింగ్‌ : భారత్‌తో సరిహద్దు వివాదంలో దుర్నీతితో తెగబడుతున్న చైనాకు అంతర్జాతీయ సమాజంలోనూ ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. చైనా నోటి దురుసుతో తాజాగా ఐరోపా దేశాలు డ్రాగన్‌ తీరును తప్పుపడుతున్నాయి. చెక్ సెనేట్ అధ్యక్షుడు మిలోస్ వైస్ట్రిల్ గురువారం ఉదయం తైవాన్‌ నేత సాయ్ ఇంగ్-వెన్‌ను తన పర్యటనలో భాగంగా కలవడం పట్ల చైనా తీవ్రస్ధాయిలో మండిపడింది. వైస్ర్టిల్‌ తైవాన్‌ పర్యటనను "అంతర్జాతీయ ద్రోహ చర్య"గా అభివర్ణించిన చైనా చెక్‌ అధ్యక్షుడి ప్రకటనలనూ తప్పుపట్టింది. ఇది బీజింగ్‌ ఒన్‌ చైనా విధానానికి విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేసింది.

వైస్ర్టిల్‌ రెడ్‌ లైన్‌ను అతిక్రమించారని ఐదు రోజుల యూరప్‌ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వి వ్యాఖ్యానించారు. తైవాన్‌ను తన భూభాగంగా పరిగణించే చైనా ఈ ద్వీపంతో ఇతర దేశాల అధికారిక సంప్రదింపులను వ్యతిరేకించే సంగతి తెలిసిందే. చెక్‌ సెనేట్‌ అధ్యక్షుడి తన హ్రస్వ దృష్టి ప్రవర్తనకు, రాజకీయ అవకాశవాదానికి భారీ మూల్యం చెల్లించేలా చైనా చర్యలు ఉంటాయని వాంగ్‌ వి హెచ్చరించారు. చదవండి : పబ్జీ నిషేధంపై చైనా కీలక వ్యాఖ్యలు

చైనా బెదిరింపులకు భయపడం..
వాంగ్‌ హెచ్చరికలను జర్మనీ, స్లొవేకియా, ఫ్రాన్స్‌లు తోసిపుచ్చాయి. ఐరోపా దేశాలు తమ అంతర్జాతీయ భాగస్వాములను గౌరవిస్తాయని వారి నుంచి అదే ప్రవర్తనను ఆశిస్తాయని..బెదిరింపులు ఇక్కడ పనిచేయవని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్‌ చైనా విదేశాంగ మంత్రికి దీటుగా బదులిచ్చారు. ఫ్రాన్స్‌ విదేశాంగ శాఖ వాంగ్‌ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. స్లొవేకియా అధ్యక్షుడు జుజనా కపుతోవా సైతం చైనా తీరును తప్పుపట్టారు.

మరిన్ని వార్తలు