India Power Grid: సరిహద్దులో చైనా మరో కుట్ర.. పవర్‌గ్రిడ్‌ల హ్యాకింగ్‌కు యత్నం!

7 Apr, 2022 09:49 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత సరిహద్దులో చైనా మరో దుశ్చర్యకు పాల్పడ్డ విషయం వెలుగు చూసింది. హ్యాకర్ల సాయంతో సరిహద్దులో ఉన్న విద్యుత్‌ పంపిణీ కేంద్రాలపై హ్యాకింగ్‌కు పాల్పడే యత్నం చేసింది. ఈ విషయం ప్రైవేట్‌ ఇంటెలిజెన్స్‌ కంపెనీ ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ బయటపెట్టింది. లడఖ్‌ రీజియన్‌లోని పవర్‌ గ్రిడ్‌ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ధృవీకరించింది. 

ఇటీవలి నెలల్లో.. గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం నిజ-సమయ(రియల్‌ టైం) కార్యకలాపాలను నిర్వహించేందుకు బాధ్యత వహించే కనీసం ఏడు ఇండియన్ స్టేట్ లోడ్ డెస్పాచ్ సెంటర్‌లను (SLDC) లక్ష్యంగా చైనా నెట్‌వర్క్ చొరబాట్లను గమనించాము. ముఖ్యంగా, ఈ లక్ష్యం లడఖ్‌లోని వివాదాస్పద భారత్-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న SLDCతో భౌగోళికంగా కేంద్రీకృతమై ఉందని గుర్తించాం. ఆ హ్యాకింగ్‌ ప్రయత్నాలన్నీ చైనా అధికారిక సైబర్‌ సెంటర్ల నుంచి వచ్చినవే’ అంటూ బుధవారం ఒక ప్రకటన చేసింది రికార్డెడ్‌ ఫ్యూచర్‌ కంపెనీ. 

పవర్ గ్రిడ్ ఆస్తుల లక్ష్యంతో పాటు.. జాతీయ అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ,  బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన భారతీయ అనుబంధ సంస్థను సైతం హ్యాకర్లు టార్గెట్‌ చేసినట్లు గుర్తించామని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ వెల్లడించింది. ఈ లెక్కన ప్రభుత్వ సహకారంతోనే హ్యాకర్లు ఈ దాడులకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇక  నివేదికను పబ్లిష్‌ చేసే ముందు.. ప్రభుత్వాన్ని ఈ విషయమై హెచ్చరించినట్లు సదరు గ్రూప్‌ వెల్లడించింది. ఈ అంశంపై కేంద్రం స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు