ప్రపంచ సంస్థలపై డ్రాగన్‌ పట్టు

3 Jul, 2021 03:28 IST|Sakshi

కీలక ఆర్గనైజేషన్లపై ప్రభావం

ఆందోళన కలిగిస్తున్న చైనా వ్యూహం  

ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం!

ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్‌కు చెందిన పార్లమెంటరీ ఫారెన్‌ అఫైర్స్‌ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్‌వే హౌస్‌ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి.  

ఆరింటిపై కన్ను
ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్‌కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్‌ఓ), ఇంటర్‌పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్‌ ఆఫీసు(ఓహెచ్‌సీహెచ్‌ఆర్‌)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఏఓ)లో నైన్త్‌ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్‌ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్‌ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్‌ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్‌ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది.  

డబ్బుతో కొనేస్తుంది
కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్‌వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్‌ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు.

అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్‌ఓకు ట్రంప్‌ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్‌  ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్‌పోల్‌లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన  నేరçస్తులపై జారీ చేసే రెడ్‌కార్నర్‌ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్‌–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్‌వే నివేదిక తెలిపింది.  

పరోక్షంగా కూడా ప్రభావం
కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్‌వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్‌ఓ అధ్యక్షుడైన టెడ్రోస్‌ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్‌ ఛాన్‌ హాంకాంగ్‌కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్‌ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి.

మరిన్ని వార్తలు