యూఎస్‌ తర్వాత ఆ రికార్డు చైనాదే..

5 Dec, 2020 17:20 IST|Sakshi

బీజింగ్‌: చంద్రుడిపై మొదట జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన దేశం అమెరికా. ఆ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశంగా చైనా నిలిచింది. డ్రాగన్‌ దేశానికి చెందిన అంతరిక్ష నౌక చాంగె–5 చంద్రుడి మీద కాలుమోపిన సంగతి తెలిసిందే. జాబిల్లి మీద నుంచి మట్టిని సేకరించిన ఈ నౌక చంద్రుడి ఉపరితలం మీద తన జెండాను పాతింది. శనివారం ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ దేశ స్పేస్‌ ఏజెన్సీ రిలీజ్‌ చేసింది. 1970 తర్వాత మొదటి ప్రయత్నంలోనే చంద్రుడి మీద మట్టిని సేకరించిన దేశంగా చైనా రికార్డు సృష్టించింది. 21 వ శతాబ్దంలో చంద్రుడి నుంచి శాంపిళ్లను సేకరించిన మూడో దేశంగా అమెరికా, రష్యాల సరసన చైనా నిలిచింది. ఇక చంద్రుడిపై జెండా ఎగురవేసిన తొలి దేశంగా అమెరికా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ మట్టి ఖరీదు రూ.11 లక్షలు)

1969లో చేపట్టిన అపోలో మిషన్‌లో భాగంగా మొదటిసారి అమెరికా తన జాతీయ జెండాని చంద్రుడి ఉపరితలం మీద రెపరెపలాడించింది. మనుషులను జాబిల్లిపైకి తీసుకెళ్లేందుకు రూపొందించిన ఈ మిషన్‌లో భాగంగా అమెరికా 12 మంది వ్యోమగాములను చంద్రుడి మీదకు తీసుకెళ్లింది. 1969 నుంచి 1972 వరకు ఆరు స్పేస్‌క్రాఫ్ట్‌ల్లో వీరిని చంద్రుడిపైకి తీసుకెళ్లారు. ఇక తిరిగి వచేటప్పుడు వీరు చంద్రుడి ఉపరితలం మీద నుంచి 382 కిలోగ్రాముల రాళ్లు, మట్టిని తమతో తీసుకొచ్చారు. చైనాకు చెందిన చాంగె-5 స్పేస్‌క్రాఫ్ట్‌ గత నెల 23న చంద్రుడి మీద ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే. మంగళవారం చాంగె -5 అంతరిక్ష నౌక ఒక జత ల్యాండింగ్, అసెండింగ్‌ వెహికల్స్‌ని చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా మోహరించింది. 2 కిలోల (4.4 పౌండ్ల) నమూనాలను సేకరించింది. మట్టిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు పటిష్టమైన కంటెయినర్‌ను వాడాల్సి ఉంటుందని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా