అమెరికా, చైనా చలో చలో..

25 Aug, 2020 10:43 IST|Sakshi

బీజింగ్ : కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్నప్పటనుంచి అమెరికా, చైనాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినప్పటికీ తాజాగా మొద‌టిద‌శ వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాలు ముందడుగు వేశాయి. దీనికి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్‌లో ముచ్చ‌టించారు. దిగుమతులు, ఎగుమతుల అంశంపై ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గుచూపారు. ఇక్కడ చైనానే ఒక మెట్టుదిగినట్లు కనబడుతోంది.‌ చైనాపై ఒత్తిడి తెచ‍్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో చైనా కాస్త వెనక్కి తగ్గింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక‌పురోగ‌తికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామ‌ని బీజింగ్ ప్ర‌క‌ట‌న చేసింది. ఈ క్రమంలోనే చర‍్చలకు ముందుకొచ్చి అమెరికాతో సంప్రదింపులు జరిపింది. 

జ‌న‌వ‌రిలోనే యూఎస్, చైనా దేశాలు మొద‌టిద‌శ ఆర్థిక ఒప్పందంపై సంత‌కాలు చేశాయి. అయితే క‌రోనా వైర‌స్ సృష్టించిన  క‌ల్లోలంతో అమెరికా బాహాటంగానే  చైనాపై అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యింది. కావాల‌నే వైర‌స్‌ను ప్ర‌పంచానికి అంట‌గ‌ట్టారంటూ ప‌లు విమ‌ర్శ‌లు చేసింది.  కరోనా వైరస్‌పై అప్రమత్తం చేయడంలో చైనా విఫలమైందని, ఆ దేశం చర్యలపట్ల అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ రెండో దశ వాణిజ్య చర్చలకు ట్రంప్  విముఖత చూపారు. (అవసరమైతే చైనాతో అన్నీ బంద్: ట్రంప్‌)

అంతేకాకుండా చైనా మాతృసంస్థ అయిన టిక్‌టాక్‌ను త్వ‌ర‌లోనే బ్యాన్ చేస్తాం అని అమెరికా ప్ర‌క‌టించింది. టిక్‌టాక్ యాప్ వల్ల జాతీయ భ‌ద్ర‌తకు ముప్పు ఉంద‌ని వాషింగ్ట‌న్ మీడియా త‌మ ప్ర‌క‌ట‌న‌ల్ని స‌మ‌ర్థించుకుంది.అయితే ఈ చ‌ర్య‌లను చైనా ప్ర‌భుత్వం తీవ్రంగా విమ‌ర్శించింది. కావాల‌నే అమెరికా అణ‌చివేత ధోర‌ణి అవ‌లంభిస్తుంద‌ని ఆరోపించింది. త‌ద‌నంత‌రం ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు  కాస్తా ట్రేడ్ వార్‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే.  చైనా ఉత్ప‌త్తుల‌పై అధిక సుంకాలు వేసిన అమెరికాపై  చైనా కూడా అదే ధోర‌ణి అవ‌లంభించింది. అవసరమనుకుంటే చైనాతో అన్ని వ్యాపార సంబంధాలు తెంచుకుంటామని ట్రంప్ హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఇరుదేశాలు మొద‌టిద‌శ ఆర్థిక ఒప్పందాల‌పై నిర్మాణాత్మక  మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. (మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి)

మరిన్ని వార్తలు