శ్రీలంకలో స్పై షిప్‌.. పాకిస్థాన్‌కు బలగాలు.. చైనా వ్యూహం ఏంటి?

17 Aug, 2022 12:33 IST|Sakshi

బీజింగ్‌: భారత్‌ అభ‍్యంతరాలను బేఖాతరు చేస్తూ ఇప్పటికే శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టులో పరిశోధక నౌకను నిలిపింది చైనా. ఇప్పుడు మరో కుట్రకు తెరతీసింది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన డ్రాగన్‌.. వాటి రక్షణ పేరుతో కుటిల బుద్ధిని చూపిస్తోంది. పాకిస్థాన్‌లో సొంతంగా మిలిటరీ ఔట్‌పోస్ట్‌లు నిర్మించి బలగాలను మోహరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు దౌత్యమార్గాల ద్వారా బహిర్గతమైంది. భారత్‌ను అష్టదిగ్బంధనం చేసే వ్యూహం పన్నుతున్నట్లు కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

సెంట్రల్‌ ఆసియాలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ మార్గాలను ఎంచుకుంది చైనా. ఆయా దేశాల్లో వ్యూహాత్మక పెట్టుబడులకు తెర తీసింది. పాకిస్థాన్‍లో చైనా పెట్టుబడులు ఇప్పటికే 60 బిలియన్‌ డాలర్లు దాటాయి. దాయాది దేశం కేవలం ఆర్థికంగానే కాకుండా మిలిటరీ, దౌత్య మద్దతులో చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. దీంతో మిలిటరీ ఔట్‌పోస్ట్‌లు నిర్మించేందుకు పాకిస్థాన్‌పై చైనా ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో, ఆర్మీ చీఫ్‌ నజరల్‌ కమర్‌ జావేద్‌ బజ్వాతో చైనా రాయబారి నాంగ్‌ రోంగ్‌ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన పాకిస్థాన్‌కు వెళ్లారు. చైనా బలగాలను మోహరించేందుకు వీలుగా ఔట్‌పోస్ట్‌లో నిర్మాణంపై పాక్‌ కొత్త ప్రభుత్వంతో చర్చలు జరిపారు నాంగ్‌ రోంగ్‌. చైనా పెట్టుబడులు పెట్టిన ప్రాజెక్టులు, తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒత్తిడి తెస్తున్నట్లు పలువురు దౌత్యవేత్తలు చెబుతున్నారు.

చైనా ఇప్పటికే గ్వాదర్‌లో సెక్యూరిటీ ఔట్‌పోస్ట్‌ నిర్మాణానికి డిమాండ్‌ చేస్తోంది. అలాగే.. గ్వాదర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ ఫైటర్‌ జెట్స్‌ కోసం వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని చెబుతోంది. అయితే, భారీగా చైనా బలగాలను దేశంలోకి అనుమతిస్తే స్వదేశ ప్రజలకు ఇబ్బందులు తప్పవని పలువురు ఉన్నతాధికారులు పాకిస్థాన్‌ను హెచ్చరిస్తున్నారు. చైనాకు చెందిన సంస్థలకు 300 బిలియన్‌ పాకిస్థాన్‌ రూపాయలను చెల్లించాల్సి ఉంది. రుణాలు తిరిగి చెల్లించలేకపోతే విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను నిలిపివేస్తేమాని ఇప్పటికే హెచ్చరించాయి చైనా సంస్థలు. పాకిస్థాన్‌లో.. బోస్టన్ ఇండస్ట్రీయల్‌ జోన్‌, గ్వాదర్‌ పోర్ట్‌, స్పెషల్‌ జోన్‌ 1, 2, సీపెక్‌, మోహ్మద్‌ మార్బల్‌ సిటీ, సోస్త్‌ డ్రై పోర్ట్‌, మోక్‌పాండస్‌ సెజ్‌ వంటివి చైనాకు చెందిన ప్రధాన ప్రాజెక్టులు. చైనా రుణాల ట్రాప్‌లో పాకిస్థాన్‌ కూరుకుపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు.. పాకిస్థాన్‌ సెక్యూరిటీ విభాగాలపై తమకు ఎలాంటి నమ్మకం లేదని చైనా పరిపాలన విభాగం చెబుతూ వస్తోంది. చైనా ఒత్తిడికి తలొగ్గటం తప్పా పాకిస్థాన్‌కు వేరే మార్గం కనిపించటం లేదు. అయితే, చైనా డిమాండ్‌ను ఆమోదిస్తే అంతర్జాతీయంగా మరింత దిగజారనుంది.

ఇదీ చదవండి: భారత్, శ్రీలంక.. ఒక చైనా నౌక

మరిన్ని వార్తలు