చైనా బెలూన్‌ పేల్చివేత

10 Feb, 2023 14:53 IST|Sakshi

అట్లాంటిక్‌ సముద్రంలో కూల్చేసిన అమెరికా

గట్టిగా బదులిస్తామన్న చైనా

వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికా గగనతలం మీదుగా ఎగురుతూ కొద్ది రోజులుగా కలకలం రేపుతున్న అనుమానాస్పద చైనా నిఘా బెలూన్‌ను అగ్రరాజ్యం కూల్చివేసింది. అట్లాంటిక్‌ సముద్రంపైకి వచ్చేదాకా వేచి చూసి అత్యాధునిక ఎఫ్‌–22 యుద్ధ విమానంతో దాన్ని పేల్చేసింది. అమెరికా అణుక్షిపణుల్ని భద్రపరిచిన మోంటానా స్థావరంపై ఈ చైనా బెలూన్‌ ఎగురుతూ కన్పించడం, అది ఇరు దేశాల మద్య చిచ్చు రేపడం తెలిసిందే.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాల మేరకు దక్షిణ కరోలినాకు ఆరు మైళ్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్ర జలాల్లో దాన్ని కూల్చివేశామని రక్షణ శాఖ ప్రకటించింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.  దక్షిణ కరోలినా మిర్టిల్‌ బీచ్‌ సమీపంలో సముద్ర జలాల్లో 11కి.మీ. మేరకు పడిపోయిన బెలూన్, దాని విడి భాగాల కోసం రెండు నేవీ నౌకలు, ఇతర భారీ నౌకల సాయంతో అన్వేషిస్తున్నారు. బెలూన్ని కూల్చివేసే మిషన్‌ను బైడెన్‌ స్వయంగా పర్యవేక్షించారు. ‘‘దాన్ని పేల్చివేసినప్పుడు ఎలాంటి నష్టం జరగకూడదని ఒత్తిడి ఎదుర్కొన్నాను. సైనిక సిబ్బంది విజయవంతంగా పని పూర్తి చేశారు. వారికి అభినందనలు’’ అన్నారు.

నిబంధనల ఉల్లంఘన: చైనా
అమెరికా తమ బెలూన్‌ను కూల్చివేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా చేసిన పనికి తగిన సమయంలో దీటుగా బదులిస్తామని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలలో పేర్కొంది. అది పౌర వినియోగం కోసం ప్రయోగించిన బెలూన్‌ మాత్రమేనని పునరుద్ఘాటించింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి ప్రయోగించిన బెలూన్‌ను అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా కూల్చేసినందుకు తమ నుంచి త్వరలోనే గట్టి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.

ఇలా కూల్చేశారు...
► దాదాపు మూడు స్కూలు బస్సుల పరిమాణంలో ఉన్న ఈ బెలూన్‌ తొలిసారిగా జనవరి 28న అమెరికా గగనతలంలోకి ప్రవేశించింది.
► దాదాపు 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ అమెరికా నిఘా కంటికి చిక్కింది. వెంటనే కెనడా వైపుగా వెళ్లి 30వ తేదీన తిరిగి అమెరికాలోకి ప్రవేశించింది.
► అణ్వాయుధ క్షిపణి ప్రయోగశాల తదితరాలున్న మొంటానాపై కూడా తిరుగుతుండటంతో కలకలం రేగింది.
► బెలూన్‌ కూల్చివేతకు మల్టిపుల్‌ ఫైటర్, రీ ఫ్యూయలింగ్‌ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. వర్జీనియాలోని లాంగ్లీ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ నుంచి దూసుకెళ్లిన ఎఫ్‌22 ఫైటర్‌ జెట్‌ పని పూర్తి చేసింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ఏఐఎం–9ఎక్స్‌ సూపర్‌సానిక్‌ ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణిని ప్రయోగించింది. వేడిని అనుసరిస్తూ దూసుకెళ్లే ఆ క్షిపణి పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించింది.
► ముందుజాగ్రత్తగా సమీప విల్మింగ్టన్, మిర్టిల్‌ బీచ్, చార్లెస్టన్‌ ప్రాంతీయ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు.
► బెలూన్‌కు అమర్చిన నిఘా పరికరాలను అమెరికా సేకరించి పరిశీలించనుంది. సముద్రంలో 47 అడుగుల లోతుకు పడిపోయిన సె¯్సర్లు తదితర విడి భాగాల కోసం నేవీ డిస్ట్రాయర్‌ యూఎస్‌ఎస్‌ ఆస్కార్‌ ఆస్టిన్, డాక్‌ లాండింగ్‌ షిప్‌ యూఎస్‌ఎస్‌ కార్టర్‌ హాల్‌ వంటివాటితో పాటు నేవీ డైవర్లు గాలిస్తున్నారు.

(చదవండి: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు