మాజీ ప్రియుడిపై ప్రతీకారం, పక్కా ప్లాన్‌.. అందుకు 50 సార్లు..

9 Jul, 2021 18:15 IST|Sakshi

ప్రేమలో ఉన్నప్పుడు బంగారం, బుజ్జి, బేబీ అని ముద్దుగా పిలుచుకునే ప్రేమికులు అదే వారి బ్రేకప్‌ తర్వాత ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవాలని ప్లాన్‌లు వేస్తున్నారు. తాజాగా  ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త పద్ధతిని ఎంచుకుంది. ఈ క్రమంలో ఆ యువతి తన మాజీ ప్రియుడితో భారీగా జరిమానా కట్టేలా ప్లాన్‌ చేసినా, ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ సంఘటన తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో  షాక్సింగ్‌ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఓ యువతి తన మాజీ ప్రియుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో ఓ మాస్టర్‌ ప్లాన్‌ వేసింది. ఇందుకోసం ఆమె.. అతని కారుని అతడికే తెలియకుండా అద్దెకు తీసుకుంది. ఆ కారుతో రోడ్లపై ర్యాష్‌ డ్రైవింగ్‌ చేయడంతో పాటు 2 రోజుల్లోని 50 సార్లు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించింది. దీని కారణంగా అతను భారీగా ఫైన్లు కట్ట​లాని ప్లాన్‌ వేసింది.

కాకపోతే ఈ తరహా ఉల్లంఘన వింతగా ఉండడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో సులువుగానే స్థానిక పోలీసులు ఆ కారును గుర్తించారు. చివరకు అసలు విషయం బయటపడడంతో పాటు ఆ యువతిని అరెస్ట్‌ చేశారు. పాపం ఆ యువతి ప్లాన్‌ అయితే వేసింది గానీ చివర్లో అది ఫైయిల్‌ కావడమే గాకా కటకటాలపాలైంది.

మరిన్ని వార్తలు