ఎదురులేని నేతగా జిన్‌పింగ్‌

12 Nov, 2021 05:21 IST|Sakshi

మూడోసారి అధ్యక్షుడిగా ఎంపికకు మార్గం సుగమం

బీజింగ్‌: డ్రాగన్‌ దేశంపై అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌(68) మరింత పట్టు బిగించారు. చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగేందుకు మార్గం సుగమమైనట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) సాధించిన విజయాలను, జిన్‌పింగ్‌ నాయకత్వంలో చైనా సాధించిన ఘనతలను, అభివృద్ధిని ప్రస్తుతిస్తూ  అధికార సీపీసీ 19వ కేంద్ర కమిటీ ఆరో ప్లీనరీలో చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించారు.

పార్టీ చరిత్రలో ఇలాంటి తీర్మానం చేయడం ఇది మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. రాజధాని బీజింగ్‌లో ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సీపీసీ ప్లీనరీ గురువారం ముగిసింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో కీలకమైన అంశాలపై చర్చించారు. కమ్యూనిస్టు పార్టీ శుక్రవారం మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనుంది. ప్లీనరీలో జిన్‌పింగ్‌ సీపీసీ కేంద్ర కమిటీ పొలిటికల్‌ బ్యూరో తరపున వర్క్‌ రిపోర్టు సమర్పించారు. తీర్మానం ముసాయిదాపై మాట్లాడారు. సీపీసీ 20వ జాతీయ సదస్సును(ఐదేళ్లకోసారి జరుగుతుంది) 2022లో జూలై తర్వాత నిర్వహించనున్నారు.

మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ ఎంపికను ఆ సదస్సులో అధికారికంగా ఆమోదించనున్నారు. ఆయన ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా ప్రధాన కార్యదర్శిగా, చైనా త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌గా(సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌), దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మూడు అత్యంత శక్తివంతమైన పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ వెంటనే మరోసారి అదే పదవిని చేపట్టేందుకు రంగం సిద్ధమైనట్లే. చైనాలో మూడుసార్లు అధ్యక్ష పదవిని అధిష్టించే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ దక్కలేదు. 2018లో చేసిన రాజ్యాంగ సవరణ ప్రకారం జిన్‌పింగ్‌ జీవితకాలం అధ్యక్ష పదవిలో కొనసాగే వెసులుబాటు కూడా ఉంది.  
 

మరిన్ని వార్తలు