అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. 10 మంది సజీవదహనం

26 Nov, 2022 09:48 IST|Sakshi

బీజింగ్: చైనా జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ టియాన్‌షాన్ జిల్లా ఉరుంఖిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి  ఇతర ఫ్లాట్‌లకు వ్యాపించడంతో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ఏడుగురు చనిపోయారు.

గరువారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే 10 మంది చనిపోవడానికి ప్రభుత్వం 'జీరో కోవిడ్ పాలసీ' పేరుతో విధించిన కఠిన ఆంక్షలే కారణమని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. కింది ఫ్లోర్ లాక్ చేసి ఉండటంతో మంటలు చూసినా బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. దీంతో అందరూ అపార్ట్‌మెంట్‌ టాప్ ఫ్లోర్‌కి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొంత మంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒకటి, రెండో అంతస్తుల నుంచి కిందకు దూకేశారని వివరించారు. మరికొంత మంది జంప్ చేసి పక్క ఫ్లాట్‌లలోకి వెళ్లినట్లు చెప్పారు.

కరోనాను కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ముఖ్యంగా కరోనా కేసులు నమోదైన అపార్ట్‌మెంట్లను లాక్ చేస్తోంది. ఎవరూ బయటకు రాకుండా కఠిన చర్యలు చేపడుతోంది.

అగ్నిప్రమాదం సంభవించిన అపార్ట్‌మెంట్‌లో 109 రోజులుగా కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడ నివసించేవారు వాళ్ల కార్లను ఇన్నిరోజులుగా బయటకు తీయలేదు. అపార్ట్‌మెంట్ ముందు దారిమొత్తం పార్క్ చేసి ఉన్నాయి. 

దీంతో మంటలార్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజిన్లకు దారి లేక సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. వారు కార్లను తొలగించి అపార్ట్‌మెంట్ చేరుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టింది. ఫలితంగా 10 మంది మంటల్లో చిక్కుకుని చనిపోయారు. ఫైరింజన్లు  సమయానికి వచ్చి ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?

మరిన్ని వార్తలు