లాక్‌డౌన్ ఇంకా ఎన్నాళ్లు? చైనాలో వెల్లువెత్తిన నిరసనలు.. వీడియోలు వైరల్‌

27 Nov, 2022 08:47 IST|Sakshi

బీజింగ్‌: అత్యంత అరుదుగా నిరసనలు చేపట్టే చైనీయుులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు. జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌ ఉరుమ్‌కిలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. జీరో కోవిడ్ పాలసీ పేరుతో చాలా రోజులుగా అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఎత్తివేయాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గురువారం రాత్రి ఉరుమ్‍కిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ నిబంధనల కారణంగా అందులోని నివసించేవారు బయటకు వెళ్ల పరిస్థితి లేదు. దీంతో 10 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై చైనా అధికారి ఒకరు నిర్లక్ష‍్యంగా మాట్లాడారు. వీళ్లు తమను తాము కాపాడుకోలేని రీతిలో చాలా బలహీనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.

దీంతో ప్రజల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. శుక్రవారం రాత్రి భారీ నిరసనలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారుు. చైనా జాతీయ గీతం ఆలపిస్తూ నినాదాలు చేశారు. 100 రోజులకుపైగా అమలు చేస్తున్న కరోనా ఆంక్షలు, లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే అగ్నిప్రమాదంలో చనిపోయిన వారికి పూలు, క్యాండిల్స్‌తో నివాళులు అర్పించారు.

చైనాలో మైనారిటీలైన వీగర్లు ఎక్కువగా ఉండే జిన్‌జియాంగ్‌లో కోటి మంది నివసిస్తున్నారు. ఉరుమ్‌కి నగరంలో 40 లక్షల మంది ఉన్నారు. ఈ ప్రాంతంలో 100 రోజులకుపైగా కఠిన కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి కూడా అనుమతి లేదు. ఈ క్రమంలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు.

ఉరుమ్‌కిలో చేపట్టిన నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చైనా రాజధాని బీజింగ్‌ సరిహద్దు ప్రాంతంలోనూ జీరో కోవిడ్ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
చదవండి: బ్రిటన్లోకి విదేశీ విద్యార్థుల వలసల కట్టడికి రిషి స్కెచ్‌!

మరిన్ని వార్తలు