బైడెన్‌ చాలా వీక్‌.. యుద్ధం రావచ్చు: చైనా

23 Nov, 2020 15:58 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికి నూతనంగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాతో యుద్ధానికి సిద్ధమవుతాడని డ్రాగన్‌ ప్రభుత్వ సలహాదారు ఒకరు ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ పదవీకాలంలో అమెరికా, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడితో సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందనే భ్రమ ప్రస్తుతం చైనాకు ఎంతమాత్రం లేదని షెన్‌జెన్‌కు చెందిన థింక్ ట్యాంక్ అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్ డీన్ జెంగ్ యోంగ్నియాన్ తెలిపారు. అమెరికా అవలంభించబోయే కఠిన వైఖరిని ఎదుర్కొనేందుకు బీజింగ్‌ సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం అంతరించింది. ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుంది. ఒక్క రాత్రిలో దీనికి ముగింపు పలకలేం. కానీ అమెరికాతో పూర్వ మైత్రి పునరుద్ధరణకు పనికివచ్చే ప్రతి అవకాశాన్ని చైనా వినియోగించుకుంటుంది. కానీ ఫలితాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయి’ అన్నారు. (బైడెన్‌ గెలుపును గుర్తించను: పుతిన్‌)

అంతేకాక ‘ప్రస్తుతం అమెరిన్‌ సమాజం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ప్రజా సమస్యలను పరిష్కరించలేని పక్షంలో బైడెన్‌ వారి దృష్టిని మరల్చడానికి చైనా వ్యతిరేక చర్యలు ప్రారంభిస్తాడు. ఒక్కొసారి తను చాలా బలహీనంగా అనిపిస్తాడు. ట్రంప్‌ ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటి అంశాల పట్ల పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ బైడెన్‌ అందుకు పూర్తిగా విరుద్ధం. ట్రంప్‌ యుద్ధం పట్ల ఆసక్తి చూపలేదు. కానీ డెమోక్రాటిక్‌ ప్రెసిడెంట్‌ యుద్ధాన్ని ప్రారంభించగలడు’ అన్నారు. ఇక ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చైనా, అమెరికా ల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కోవిడ్‌తో సహా పలు అంశాలు ఇందుకు దోహదం చేశాయి. ఇక బైడెన్‌ అధ్యక్ష కాలంలో చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని విదేశాంగ విధాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు